
మత్స్యకారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్లఅర్బన్: మత్స్యకారులు చేపల పెంపకంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట రైతువేదికలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ మత్స్యరైతుల వేడుకలు నిర్వహించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ చెరువుల్లోకి సకాలంలో చేపల పంపిణీ చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తాము ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే కథలాపూర్ మండలంలో తెగిపోయిన చెరువులను మరమ్మతులు చేయించామని, మల్కపేట రిజర్వాయర్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలు కేజీకల్చర్‌లో చేపల పెంపకానికి ముందుకురావాలని కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీష్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డీఏవో అఫ్జల్‌బేగం, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సునీల్‌కుమార్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు.