
ఎస్సైల బదిలీలు
సిరిసిల్లక్రైం: జిల్లాలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్ బీ గీతే గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్‌ను గంభీరావుపేటకు, సిరిసిల్ల ఎస్సై శ్రీనివాసరావును ఇల్లంతకుంటకు, తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్‌ను వేములవాడకు, రుద్రంగి ఎస్సై మోతిరామును ఎల్లారెడ్డిపేటకు, వేములవాడ ఎస్సై లఘుపతిని డీఎస్బీకి, వేములవాడ ఎస్సై గణేశ్‌ను సీసీ ఎస్‌కు, ఉపేంద్రచారిని తంగళ్లపల్లి ఎస్సైగా నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెషనల్ ఎస్సైలు వేముల లక్ష్మణ్‌ను వీర్నపల్లికి, వినీతారెడ్డిని సిరిసిల్లకు, పోరండ్ల అని ల్‌కుమార్‌ను వేములవాడకు, బి.శ్రీనివాస్‌ను రుద్రంగికి, కె.రాహుల్‌రెడ్డిని ఎల్లారెడ్డిపేట ఎస్సైగా నియమించారు. వేములవాడ టౌన్ ఎస్సై వెంకటరాజంను డీఎస్బీ వేములవాడ, సిరిసిల్ల టౌన్ ఎస్సై శంకర్‌నాయక్‌ను డీఎస్బీ సిరిసిల్లకు, డీఎస్బీలోని సుబ్రహ్మణ్యచారిని గంభీరావుపేట ఎస్సైగా నియమించారు.
వేములవాడలో మరోసారి కూల్చివేతలు
వేములవాడ: వేములవాడ మెయిన్‌రోడ్డు విస్తరణలో భాగంగా గురువారం రాజన్న ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఉన్న పాత నిర్మాణాలను గురువారం కూల్చివేశారు. 88 నిర్మాణాలకు కోర్టు స్టే ఉండడంతో మిగతా వాటిని కూల్చివేస్తున్నారు. ఇప్పటికే కూల్చేసిన భవనాల శిథిలాలు అలాగే ఉండగా, మరిన్ని కూల్చేయడంతో రోడ్డు దుమ్ముతో నిండిపోతుందని స్థానికులు పేర్కొంటున్నారు. కూల్చివేతలు త్వరగా పూర్తి చేసి శిథిలాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మాదక ద్రవ్యాలను నివారించాలి
సిరిసిల్లకల్చరల్: మత్తు పదార్థాలు సామాజిక అనర్థాలకు దారితీస్తాయని.. వాటిని నివారించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ కోరారు. నెహ్రూనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాధికా జైస్వాల్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటైన వ్యక్తులు అరాచక శక్తులుగా మారే ప్రమాదం ఉందన్నారు. విద్యార్ధి దశలోనే మాదక ద్రవ్యాలతో కలిగే దుష్ప్రభావాలను అర్థం చేసుకోవాలని సూచించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మల్లేశ్‌యాదవ్, రిజర్వ్ ఎస్సై సాయికిరణ్, పాఠశాల హెచ్‌ఎం భాగ్యరేఖ పాల్గొన్నారు.
గోశాల సిబ్బందికి నియామక పత్రాలు
వేములవాడఅర్బన్: తిప్పాపూర్ గోశాలలో కొత్తగా నియమించిన సిబ్బందికి గురువారంనియామకపత్రాలను అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో 40 మందికి గాను 38 మంది సిబ్బందికి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. వారిని శుక్రవారం నుంచి విధులకు హాజరుకావాలని సూచించారు. వేములవాడ పరిధిలోని హన్మక్కపల్లిలో 25 ఎకరాలు, మర్రిపల్లిలో 40 ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయించారు. దానిలో రాజన్న గోశాలలోని కోడెల కోసం పచ్చిగడ్డి పెంచాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డికి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, తహసీల్దార్లతో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి ఆయా స్థలాలను పరిశీలించారు.
నేడు జాబ్‌మేళా
సిరిసిల్లకల్చరల్: ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగా వకాశాలు కల్పించేందుకు శుక్రవారం సిరిసిల్లలోని ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.10వేల నుంచి రూ.20వేల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. ఎస్సెస్సీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులు జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు.

ఎస్సైల బదిలీలు