
నోరూరించే పౌష్టికాహారం
● కేజీబీవీల్లో కొత్త మెనూ ● ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి.. ● జిల్లాలోని 13 కేజీబీవీలలో అమలు ● పెరుగుతున్న అడ్మిషన్లు
గంభీరావుపేట(సిరిసిల్ల): నోరూరించే టిఫిన్స్.. ఘుమఘుమలాడే కిచిడి.. పొగలుగక్కే సాంబారు.. మనసు కోరుకునే పండ్లు.. ఇవన్నీ ఏదో ఫైవ్‌స్టార్ హోటల్‌లోని మెనూ కాదు.. కస్తూర్భాగాంధీ విద్యాలయం విద్యార్థినులకు అందించే పౌష్టికాహారం. కేజీబీవీల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్యకరమైన, రుచికరమైన కొత్త మెనూను రూపొందించింది. వంట సిబ్బంది సైతం ఇటీవల వంటల తయారీపై శిక్షణ పొందారు. ఈ కొత్త మెనూకు విద్యార్థుల నుంచి స్పందన లభిస్తోంది. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు పౌష్టికాహారం అందించి, అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
పెరిగిన మెస్‌చార్జీలు
కొత్త మెనూ అమలుతోపాటు మెస్ నిర్వహణ ఖర్చులు పెరగడంతో మెస్‌చార్జీలను కూడా పెంచింది. గతంలో 6–10, ఇంటర్ విద్యార్థినులకు ఒకేలా నెలకు రూ.1225 ప్రభుత్వం అందించేది. కానీ కొత్త మెనూ ప్రకారం 6–7 తరగతుల విద్యార్థినులకు నెలకు రూ.1330, 8–10 తరగతుల విద్యార్థినులకు నెలకు రూ.1,540, ఇంటర్ విద్యార్థినులకు నెలకు రూ.2,100 చొప్పున అందించనున్నారు.
కొత్త మెనూ ఇదే..
ఉదయం : టమాట, కిచిడీ, సాంబారు, బూస్ట్, పూరి, రాగిజావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్‌తోపాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. అందులో అరటి పండు, జామ, వాటర్‌మిలన్, బొప్పాయి, సపోట ఉండాలి.
మధ్యాహ్నం: టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు, చికెన్ అందించాలి.
సాయంత్రం: ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు, బజ్జీ, బెల్లంపల్లీలు, అల్లంచాయ్, మిల్లెట్స్, బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి.
రాత్రి: వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, ఐదుసార్లు గుడ్లు, ప్రతి రోజు నెయ్యి అందించాలి.