
వర్షాకాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, దోమల వృద్ధి నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో గురువారం జిల్లా వైద్యాధికారులతో మిడ్‌లెవెల్ హెల్త్ (ఎంఎల్‌హెచ్‌పీ)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుడూ వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, జ్వరాలపై వైద్యసేవలు అందిస్తూ అవి వ్యాపించకుండా ప్రజలను చైతన్యపరచాలన్నారు. కేంద్ర ఆరోగ్య పథకాల్లో ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఆరోగ్య శిబిరాలను పల్లెల్లో నిర్వహించాలన్నారు. ఆరోగ్య ప్రగతి నివేదికలు అందించాలన్నారు. జిల్లాలో డయేరియా నివారణపై రోజువారీ నివేదికలు ఇవ్వాలని, జిల్లా మాతాశిశు సంరక్షణ అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా అందించాలని రజిత కోరారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంపత్‌కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ నహీమా జహా, ప్రాథమిక కేంద్రాల వైద్యులు, ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు.