
దశాబ్దాల కల.. నెరవేరుతున్న వేళ
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణం.. దక్షిణకాశీలో ఇక నుంచి ట్రాఫిక్‌జామ్.. వాహనాల హారన్‌మోతలకు చెక్ పడనుంది. వేములవాడ పట్టణ ప్రజలు.. రాజన్న భక్తులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. 80 ఫీట్లతో రోడ్డు విస్తరణకు అధికారులు పనులు మొదలుపెట్టారు. తిప్పాపూర్ మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు ప్రధాన రహదారిని 80 ఫీట్లతో విస్తరించనున్నారు. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలు తొలగించారు. కోర్టు స్టే ఉండడంతో 88 నిర్మాణాలు కూల్చివేతలు నిలిచిపోయాయి. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
88 నిర్మాణాలపై కోర్టు స్టే
ఈ రోడ్డు విస్తరణలో 750 మీటర్లు భూసేకరణ చేస్తున్నారు. ఇందులో 322 నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఇందులో 254 మంది నిర్వాసితులుగా మిగిలిపోతున్నారు. వీరికి ప్రభుత్వం పరిహారం అందజేసింది. అయితే 322 నిర్మాణాల్లో 88 నిర్మాణాలపై కోర్టులో స్టే ఉండడంతో కూల్చివేతలు నిలిపివేశారు. కోర్టు అనుమతి అనంతరం పనులు వేగవంతం చేయనున్నారు. ఈ 80 ఫీట్ల రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.47.50 కోట్లు మంజూరుచేసింది. ఈ డబ్బులు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి.
వేములవాడలో 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు మోక్షం హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులు కోర్టు స్టేతో నిలిచిన 88 కూల్చివేతలు త్వరలోనే పనులు ప్రారంభిస్తామంటున్న అధికారులు
వివరాలు ఇలా..
నిర్వాసితులు : 254
నిర్మాణాలు : 322
భూసేకరణ : 750 మీటర్లు
రోడ్డు విస్తరణ : 80 ఫీట్లు