
పచ్చిగడ్డి సాగుచేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● రాజన్న గోశాల తనిఖీ
వేములవాడఅర్బన్: రాజన్న గోశాలలోని కోడెలకు సంబంధించిన దాణ కోసం పచ్చిగడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ గోశాలను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. గోశాల ఆవరణలోని కోడెలు, గడ్డిని పరిశీలించారు. గోశాల ఆవరణలో మట్టిని చదును చేయించాలని సూచించారు. కోడెలకు నిత్యం పచ్చిగడ్డి అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వేములవాడ పరిధిలోని హనుమక్కపల్లిలో 22 ఎకరాలు, మర్రిపల్లిలో 40 ఎకరాలు, మూడపల్లిలోని 20 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పచ్చిగడ్డి పెంపకానికి చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డిని ఆదేశించారు. గోశాలలో పనిచేసేందుకు ఇటీవల నియమించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని, వారికి డ్రెస్‌కోడ్, ఐడీ కార్డ్ అందించాలని సూచించారు. రాజన్న ఆలయ ఇన్‌చార్జి ఈవో రాధాభాయ్, పశుసంవర్ధక అధికారి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పౌష్టికాహారం అందిస్తూ.. పాఠాలు బోధించాలి
అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ పాఠాలు బోధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల హాజరు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు విధులకు హాజరు కాకపోవడంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీఈవో వినోద్‌కుమార్‌ను ఆదేశించారు.
ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు
సిరిసిల్ల: జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హెచ్చరించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎరువుల సరఫరాపై కంపెనీల డీలర్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన మేర స్టోరేజీ అందుబాటులో ఉందన్నారు. ప్రతీ డీలర్ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ ఈ–పాస్ యంత్రాల ద్వారా ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. బల్క్‌స్టాక్ పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల షాపులకు ఎంత స్టాక్ ఏ సమయంలో సరఫరా చేస్తున్నారు, ప్రతీ షాప్ వద్ద ప్రస్తుతం ఎంత స్టాక్ ఉందనే వివరాలు అందించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, వ్యవసాయాధికారి(టెక్) కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.