
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించాలి
● జెడ్పీ సీఈవో వినోద్
సిరిసిల్ల: జిల్లాలోని గ్రామపంచాయతీలు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో జాతీయ అవార్డులు సాధించేలా కృషిచేయాలని జెడ్పీ సీఈవో వినోద్ కోరారు. కలెక్టరేట్ నుంచి బుధవారం డీఆర్‌డీవో శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్‌తో కలిసి ఎంపీడీవోలతో గూగుల్‌మీట్ నిర్వహించారు. వినోద్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ–2025 జాతీయస్థాయి అవార్డులు సాధించేలా అన్ని కోణాల్లోనూ గ్రామాలను తీర్చిదిద్దాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ స్థాయి బృందాలు గ్రామాలను సందర్శించినప్పుడు పరిశీలించే అంశాలను వివరించారు. గ్రామాల్లో ఓడీఎఫ్ ప్లస్‌లో భాగంగా చేసిన పనులను పరిశీలించి 120 మార్కులు, సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్‌కు 240, మొబైల్‌యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 100, డైరెక్ట్ అబ్జర్వేషన్‌కు 540 మార్కులు ఉంటాయని వివరించారు. ఇంటింటికీ టాయిలెట్లు ఉండాలని, తడి, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరుచేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌కు ఇవ్వాలని సూచించారు. మురికినీటి నిర్వహణలో భాగంగా ప్రతీ ఇంటికి ఇంకుడుగుంతలు ఉండాలని, డ్రెయినేజీ ఎండింగ్ పాయింట్ సోక్‌పిట్‌లు నిర్మించాలని సూచించారు. ప్లాస్టిక్ ఇతర వస్తువులను ప్లాస్టిక్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌కు తరలించాలని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్, గోబర్‌గ్యాస్ ప్లాంట్లను సందర్శిస్తారని వివరించారు. డీఎల్‌పీవో నరేశ్, స్వచ్ఛభారత్ మిషన్ కన్సల్టెంట్ సురేశ్, ప్రేమ్, ఎంఐఎస్ కన్సల్టెంట్ పాల్గొన్నారు.