
ట్రాక్టర్ ఇసుక 5 వేలు!
● ఇందిరమ్మ ఇళ్ల పేరిట దందా
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్‌లో ఇసుక ధర చుక్కలనంటుతోంది. ఇల్లు నిర్మించుకునే సామాన్యులు ట్రాక్టర్ ఇసుక ధర చెబితే హడలిపోతున్నారు. వారం క్రితం వరకు ఇసుక ట్రాక్టర్ ట్రిప్పు ధర రూ.6వేలు పలకగా.. ఇప్పుడు అది రూ.5వేలకు చేరింది. అది కూడా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొండాపూర్ మానేరు వాగు రీచ్ నుంచి వస్తున్న ఇసుక పక్కదారిపడుతోందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రోజుకు 60 నుంచి 80 ట్రిప్పుల వరకు రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల కోసం అనుమతి పత్రాలు జారీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడి పేరుతో రవాణా అవుతున్న ఇసుక ప్రైవేటు భవనాల నిర్మాణాలకు, పొరుగు జిల్లాకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి అమాంతం ఇసుక ధర పెంచారని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.5వేలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ముస్తాబాద్ తహసీల్దార్ సురేశ్‌కు అనేక ఫిర్యాదులు రావడంతో ఇసుక ట్రాక్టర్ల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆరునెలల క్రితం ట్రాక్టర్ ట్రిప్పు ఇసుక రూ.2,500 నుంచి రూ.3వేలు పలికింది. ఇందిరమ్మ ఇల్లుకు ఎలాంటి టోకేన్‌ను ప్రభుత్వం తీసుకోవడం లేదు. అయినా రూ.5వేలు వసూలు చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.