
కరెంట్ కట్‌కట
బోయినపల్లి(వేములవాడ): జిల్లాలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. చినుకులు పడితే చాలు చీకట్లు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రాలు, గ్రామాల్లో కరెంట్ కట్‌కట మొదలైంది. గతంలో ఎన్నడూ ఇలాంటి కరెంట్ కోతలు చూడలేదని ప్రజలు వాపోతున్నారు. ఆదివారం, సోమవారం రాత్రి వేళ కరెంట్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడింది. దీంతో బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో చీకట్లు అలుముకున్నాయి. అర్ధరాత్రులు కరెంట్ పోతే తిరిగి రావడం లేదని వాపోతున్నారు. గాలి, వాన ఏది లేకున్నా ఒక్కోసారి కరెంట్ ఎందుకు తీసేస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వేళ కూడా తరచూ కరెంట్ పోతుండడంతో వివిధ పనులపై మండల కేంద్రాలకు వచ్చిన వారు బ్యాంకు, తపాలా, మీసేవల కోసం గంటల తరబడి అక్కడే ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
చెట్లకొమ్మలు కొట్టినా తొలగని అంతరాయం
వర్షాకాలంలో ఈదురుగాలులకు చెట్లకొమ్మలు విద్యుత్‌తీగలకు తగిలి కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఇటీవల జిల్లా వ్యాప్తంగా చెట్లకొమ్మలు తొలగించారు. చెట్లకొమ్మలు తొలగించినా నిత్యం కరెంట్ పోతుండడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంటల కోతలు పూర్తయినా విద్యుత్ అంతరాయ కలగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెస్ ఉన్నతాధికారులు స్పందించి బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
తరచూ అంతరాయం
చినుకుపడితే చీకట్లే..
అర్ధరాత్రి విద్యుత్‌కోతలు
పట్టించుకోని విద్యుత్ అధికారులు