
సారూ.. పట్టించుకోండి
సిరిసిల్లఅర్బన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్ బాట పట్టారు. గత వారం ప్రజావాణి రద్దు కావడంతో సోమవారం భారీగా తరలివచ్చారు. బాధితుల నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డీఆర్‌డీవో శేషాద్రిలు స్వీకరించారు. మొత్తం వివిధ సమస్యలపై 261 దరఖాస్తులు వచ్చాయి. సమస్యలు పరిశీలిస్తూ పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు.
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు మంజురు చేయండి
ఉపాఽధి కోసం నా భర్త మలేషియా వెళ్లి చనిపోయాడు. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నాకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు రిష్విత అంగవికలాంగురాలు. కదలలేని స్థితిలో ఉంది. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉంది. నా కు విడో పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి.
– తోట జయశ్రీ, శివనగర్
భూమి రిజిస్టేషన్ రద్దు చేయండి
నేను పట్వారీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నా భార్య 2010లో మృతిచెందింది. నాకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. 2010 నుంచి 2015 వరకు నా పెద్దకుమార్తె వద్ద ఉన్నాను. 2015 నుంచి 2024 వరకు చిన్నకుమారుడి వద్ద ఉన్నాను. గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరు కుమారులు చెరో నెల పోషిస్తామన్నారు. పెద్ద కొడుకు అశోక్ పట్టించుకోవడం లేదు. పెద్ద కొడుకు, కోడలు పేరిట చేసిన వ్యవసాయ భూమి రిజిస్టేషన్ ను రద్దు చేయండి.
– అమ్ముల గౌరయ్య, పెద్దలింగాపూర్(ఇల్లంతకుంట)
ఒర్రెను పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి
సిరిసిల్ల పట్టణ పరిధిలోని చిన్నబోనాలలో 40 ఏళ్లుగా ఉన్న ఒర్రెను, తొవ్వను కొందరు ఇటీవల పూడ్చివేశారు. పెద్దచెరువు నుంచి వచ్చే కాల్వను మలుపడంతో మా భూమిలోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. పంట నష్టపోతాం. పెద్దచెరువు కాలువను, ఒర్రెను పూడ్చివేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి.
– నిమ్మల రాజు,
చిన్నబోనాల(సిరిసిల్ల)

సారూ.. పట్టించుకోండి

సారూ.. పట్టించుకోండి