
చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు
సిరిసిల్లకల్చరల్: రెండు చోరీలకు పాల్పడ్డ నిందితుడికి ఒక కేసులో 5 నెలల 14 రోజులు, మరో కేసులో 3 నెలల 14 రోజులు జైలుశిక్ష విధిస్తూ సోమవారం ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ తీర్పు వెలువరించారు. 2025 జనవరి 9న బల్యాలనగర్‌కు చెందిన బల్యాల వినయ్ తన బైక్‌ను గాంధీనగర్ హనుమాన్ గుడి దగ్గర పార్క్ చేశాడు. ఒక గంట తర్వాత వచ్చి చూసేసరికి బండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఇల్లంతకుంటకు చెందిన దుర్మెట్ట నరేశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అలాగే 2014 అక్టోబర్ 8న మరో ద్విచక్రవాహనాన్ని తన షాపు ముందు పార్క్ చేసి సాయంత్రం తిరిగి వచ్చి చూడగా వాహనం చోరీకి గురైందని గుర్తించిన యజమాని నెహ్రూనగర్‌కు చెందిన దేవనపల్లి విష్ణుప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులోనూ నిందితుడు దుర్మెట్ట నరేశ్‌గా పోలీసులు గుర్తించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పీపీ చెలుమల సందీప్ కేసు వాదించగా సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత నిందితుడికి మొదటి కేసులో 5 నెలల 14 రోజులు, రెండో కేసులో 3 నెలల 14 రోజులపాటు కారాగార శిక్ష విధించారు.
దాడి కేసులో ఒకరికి జైలు
సిరిసిల్లకల్చరల్: ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితుడికి 4 నెలల 23 రోజుల జైలుశిక్ష విధిస్తూ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పునిచ్చారు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నక్క భార్గవ్‌పై కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగొస్తున్న దారిలో పాతకక్షలను మనసులో పెట్టుకుని అడ్డగట్ల శివ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో భార్గవ్ తలకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అప్పటి ఎస్సై సీహెచ్.శ్రీకాంత్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశాడు. నలుగురు సాక్షులను విచారించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి 4 నెలల 23 రోజుల జైలు శిక్ష విధించింది.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ముస్తాబాద్: రైతులకు భరోసా ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని పార్టీ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై మండలంలోని చిప్పలపల్లి, చీకోడు గ్రామాల్లో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, వైస్‌చైర్మన్ రాంరెడ్డి, కొప్పు రమేశ్, కొండల్‌రెడ్డి, రాజు, గుండెల్లి శ్రీనివాస్, బాల్‌రెడ్డి, రాజలింగం, శ్రీను, నరేశ్ పాల్గొన్నారు.