
హన్మాజీపేట బడి.. ‘జ్ఞాన’వెలుగుల గుడి
● మేధావుల పుట్టినిల్లు ఈ హైస్కూల్ ● జ్ఞానపీఠానికి ఎదిగిన సినారె ● ఎస్‌యూ వీసీగా మల్లేశం
వేములవాడ: పెద్దబడిగా పిలుచుకునే హన్మాజీ పేట సర్కారు బడి మేధావులకు పుట్టినిల్లు. జ్ఞానపీఠం అందుకున్న సినారె.. ఒగ్గుకళాకారుడు మి ద్దె రాములు.. ఎస్‌యూ వైస్‌చాన్స్‌లర్ సంకసాల మల్లేశం.. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద జాబితా నే ఉంటుంది. వేములవాడరూరల్ మండలం హన్మాజీపేట హైస్కూల్‌లో అక్షరాలు దిద్దిన ఎందరో నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కొండబత్తిని శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన తీగల రవీందర్‌గౌడ్, హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్‌గా విధులు నిర్వహించిన తీగల రాంప్రసాద్‌గౌడ్.. వంటి వారెందరో ఇక్కడ చదువుకున్నవారు. కవులు, కళాకారులు, క్రీడాకారులు, మీడియారంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ బడిబిడ్డలే.
75 ఏళ్ల వజ్రోత్సవాలు
పదూర్లకు మధ్యలో ఉన్న హన్మాజీపేట బడి ఆ గ్రామాల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పింది. పాఠశాల పుట్టి 75 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవల పూర్వ విద్యార్థులు వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దాదాపు 2వేల మంది పూర్వవిద్యార్థులు రెండు రోజులపాటు పండుగ చేసుకుని మురిసిపోయారు. విద్యాబుద్ధులు నేర్పించిన అధ్యాపకులను సన్మానించారు.