
చినుకు పడదు.. చింత తీరదు
● వాడిపోతున్న మొలకలు ● భూమిలో నీటిజాడ కరువు ● ముందస్తు తొలకరి ఆశలు ఆవిరి ● ముఖం చాటేసిన వరుణుడు ● ఆందోళనలో అన్నదాతలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తొలకరి జల్లులు ముందే పలకరించడంతో జిల్లాలోని రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. గత పదిహేను రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో భూమిలో నాటిన విత్తనాలు మొలకెత్తడం లేదు. కొంత నీటి తడి ఉన్న భూముల్లో మొలకెత్తిన పత్తిమొలకలు వాడిపోతున్నాయి. వర్షాలు సరిగ్గా కురువకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పలువురు రైతుల బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురియాలని కోరుతూ.. రైతులు ఆలయాలు, పూజలు, కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. వరుణదేవుడు కరుణించాలని గ్రామ దేవతలకు అభిషేకాలు చేస్తున్నారు.
ఎకరానికి రూ.10వేల పెట్టుబడి
పత్తి విత్తనాలు విత్తుకోవడానికి రైతులు ఎకరానికి దాదాపు రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఎకరానికి మూడు ప్యాకెట్ల విత్తనాలకు రూ.3వేలు, దుక్కి దున్నేందుకు ట్రాక్టర్‌కు రూ.5వేలు, కూలీలకు రూ.2వేల వరకు ఖర్చు పెట్టారు. తీరా విత్తనాలు నాటిన తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో మొలకెత్తడం లేదు. మొదట్లో వేసిన విత్తనాలు మొలకెత్తని చోట్ల మళ్లీ విత్తనాలు విత్తుకోవాల్సిన పరిస్థితి. దీనికి అదనంగా రైతులు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. పెట్టుబడి డబ్బులు కూడా మీదపడేలా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెనుకపడ్డ వర్షాలు
ఈ సీజన్‌లో ముందస్తుగా తొలకరి పలకరించడంతో రైతులు విత్తనాలు వేసుకున్నారు. అయితే తర్వాత వర్షాలు కురవడం లేదు. గతేడాది జూన్ నెలలో సాధారణ వర్షపాతం 133 శాతం కాగా 167.08 శాతం అనగా 26 శాతం అధికంగా కురిసింది. ఈ ఏడాది ఈ జూన్‌లో ఇప్పటి వరకు ఒక్క రోజు మాత్రమే వర్షం కురిసింది. ఈనెల 12న వేములవాడలో 9.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈనెలలో 80 శాతం లోటు వర్షపాతం ఉంది. దీంతో మొలకలు వాడిపోతున్నాయి.
ఇతను ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన రైతు గుల్లపల్లి నరసింహారెడ్డి. తొలకరి జల్లులు కురవడంతో తనకున్న భూమిలో రెండు ఎకరాలలో పత్తి విత్తనాలు విత్తుకున్నాడు. తర్వాత వర్షం కురువకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో స్ప్రింక్లర్లు ఏర్పా టు చేసి నీటితడి అందించడంతో ఐదా రు రోజుల్లో విత్తనాలు మొలకెత్తాయి. అయితే వారం రోజుల్లోపే బోరులో నీళ్లు సరిపోక స్ప్రింక్లర్లు పనిచేయలేదు. దీంతో ఇప్పుడు స్ప్రింక్లర్లు తొలగించి.. వర్షం కోసం ఎదురుచూస్తున్నాడు.
8 ఎకరాల్లో పత్తి పెట్టిన
నాకున్న 8 ఎకరాలలో పత్తి విత్తనాలు నాటిన. అయితే తొలుత వర్షం పడడంతో దుక్కి దున్ని విత్తనాలు నాటుకున్న. కానీ తర్వాత వర్షాలు కురువకపోవడంతో కొన్ని విత్తనాలు భూమిలోనే మురిగిపోయినయి. కొంతమేరకు మొలకెత్తకపోగా, మొలకెత్తినవి కూడా వాడిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.30వేల వరకు నష్టపోయిన.
– ఉల్లి దేవయ్య, దుమాల
అడుగున్నర లోతు తడి ఉంటేనే విత్తుకోవాలి
రైతులు తొలకరి జల్లులు కురువగానే పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అడుగున్నర లోతు తడి ఉంటేనే ఎప్పుడైనా విత్తనాలు నాటుకోవాలి. నేలలో తడి లేకపోవడంతోనే మొలకలు రావడం లేదు. జూలై నెలాఖరు నాటికి కూడా పత్తి వేసుకోవచ్చు. రైతులు ఆందోళన చెందవద్దు.
– అఫ్జల్‌బేగం, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లా సమాచారం
రైతులు 31,490
విస్తీర్ణం 50,500 ఎకరాలు
ఎకరానికి పెట్టుబడి రూ.10వేలు

చినుకు పడదు.. చింత తీరదు

చినుకు పడదు.. చింత తీరదు

చినుకు పడదు.. చింత తీరదు