
రైతుభరోసా రూ.133.53 కోట్లు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో అన్నదాతలకు రైతుభరోసా పథకంలో రూ.133.53 కోట్లు జమయ్యాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శనివారం తెలిపారు. ఖరీఫ్(వానాకాలం) సీజన్ సాగుకోసం జిల్లాలోని 1,22,019 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.133,53,84,248 జమయ్యాయని వివరించారు.
యోగాతో ప్రశాంతత
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రశాంత జీవనం సొంతమని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. భారత్ ప్రపంచానికి ఇచ్చిన విలువైన కానుక యోగా అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన యోగా డేలో పాల్గొన్నారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోడెలకు పచ్చిగడ్డి ఇచ్చేందుకు ముందుకురావాలి
● జిల్లా పశు వైద్యాధికారి రవీందర్‌రెడ్డి
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి గోశాలలోని కోడెలకు దాతలు పచ్చిగడ్డి ఇచ్చేందుకు ముందుకురావాలని జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి శనివారం కోరారు. రాజన్న కోడెలకు దాతలు పచ్చిగడ్డి వితరణ చేసి స్వామి వారి సేవలో భాగస్వాములు కావాలన్నారు. చందుర్తి మండలం లింగంపేటకు చెందిన పెగ్గర్ల రమేశ్‌రావు, ఏనుగుల అనిల్ గోశాలకు 1500 కిలోల పచ్చిగడ్డి పంపించారని తెలిపారు. ఇప్పటి వరకు 7,500 కిలోల గడ్డిని దాతలు వితరణ చేశారని చెప్పా రు. రైతులు చంద్రశేఖర్‌రావు, రామారావు, బోడపట్ల జలంధర్, ఈగ ప్రవీణ్, మనోహర్ పచ్చిగడ్డిని పంపించినట్లు వివరించారు.
ఆసాములకు కూలీ పెంచి ఇవ్వాలి
● పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్
సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమలోని పాలిస్టర్ వస్త్రోత్పత్తి ఆసాములకు తగ్గించి కాకుండా కూలీ పెంచి ఇవ్వాలని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. పవర్‌లూమ్, వార్పిన్, వైపని కార్మికులు, ఆసాములకు కూలీ నూతన ఒప్పందం చేయాలని కోరారు. కూలీ పెంచి ఇవ్వకుండా కార్మికులను, ఆసాములను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తగ్గించిన కూలీని వెంటనే పెంచి ఇవ్వకపోతే ఈనెల 25న పాలిస్టర్ వస్త్రవ్యాపార సంఘ భవనం ఎదుట ధర్నా చేయనున్నట్లు హెచ్చరించారు. పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.
సార్ జీవితం భావితరాలకు స్ఫూర్తి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్లటౌన్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. జయశంకర్ వర్ధంతిని శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ వైస్‌చైర్మన్ గూడూరి ప్రవీణ్, న్యాలకొండ రాఘవరెడ్డి, కుంభాల మల్లారెడ్డి, కల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

రైతుభరోసా రూ.133.53 కోట్లు

రైతుభరోసా రూ.133.53 కోట్లు