
షాపు తెరుచుకోక ప‘రేషన్’
● పేదల బియ్యం పంపిణీలో అలసత్వం ● 23వ వార్డు ప్రజలకు తప్పని తిప్పలు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని రేషన్ దుకాణాలు మూడు నెలల బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులతో కళకళలాడుతుంటే ఒక్క షాప్ మాత్రం మూసివేసి ఉంది. అధికారుల నిర్లక్ష్యం.. డీలర్ల అత్యుత్సాహం.. రాజకీయ నేతల జోక్యంతో స్థానిక వెంకంపేటలోని రేషన్ దుకాణం పరిధిలోని లబ్ధిదారులకు బియ్యం అందడం లేదు. పట్టణంలోని 23వ వార్డులోని రేషన్ దుకాణం నంబర్ 3908001 డీలర్ నెల క్రితం మరణించారు. అప్పటి నుంచి రేషన్‌షాపు తెరుచుకోవడం లేదు. అయితే సమీప రేషన్ దుకాణం డీలర్‌కు ఇన్‌చార్జీ బాధ్యతలు ఇవ్వాలి. కానీ రాజకీయ నేతల ఒత్తిళ్లు, డీలర్ల అత్యుత్సాహంతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సదరు రేషన్‌షాపులో సుమారు 600 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ రేషన్‌షాపు పరిధిలో మూడు నెలల బియ్యం పంపిణీకి లబ్ధిదారులు వేచిచూస్తున్నారు. రెవెన్యూ అధికారులు రేషన్‌డీలర్‌కు అప్పగించడంలో జాప్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ ప్రాంతానికి ఇన్‌చార్జి రేషన్‌డీలర్‌ను కేటాయించి మూడు నెలల బియ్యం పంపిణీ చేయించాలని కోరుతున్నారు. ఈ విషయంపై సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. రేషన్‌షాపునకు ఇన్‌చార్జీని నియమించేందుకు ఆర్డీవోను కోరినట్లు తెలిపారు. వెంటనే నియమిస్తామన్నారు.