
యోగాసనాలతో సుఖప్రసవాలు
● జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్.రజిత
సిరిసిల్ల: యోగాసనాలతో గర్భిణులు సుఖప్రసవాలకు అవకాశం ఉందని, సులభంగా వీలైన మేరకు ఆసనాలు సాధన చేసి సీ–సెక్షన్(ఆపరేషన్) లేకుండా నార్మల్‌గా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాలతో గర్భిణులకు, బాలింతలకు అంగన్‌వాడీ టీచర్లకు యోగాపై శిక్షణ ఇచ్చారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ దేశంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీ–సెక్షన్లలో ముందుందని, నార్మల్ డెలివరీల కోసం యోగాసనాలను నేర్చుకోవాలన్నారు. నిత్య సాధనతో ఆరోగ్యం బాగుంటుందన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యం, మానసిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్యజనని అనే ప్రత్యేక కార్యక్రమంలో యోగా శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు, బాలింతలు అయినప్పుడు చేయాల్సిన ప్రత్యేక ఆసనాలపై అవగాహన ఉండాలన్నారు. యోగాతో పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని లక్ష్మీరాజం వివరించారు. రామకృష్ణ మఠం డాక్టర్లు అంజలి, దీప్తి, పిల్లల డాక్టర్ సురేంద్రబాబు, సీడీపీవోలు సౌందర్య, ఉమారాణి, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్, ఇన్‌చార్జి ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్‌లైన్ కో–ఆర్డినేటర్ పరమేశ్వర్, సఖీ కో–ఆర్డినేటర్ మమత పాల్గొన్నారు.

యోగాసనాలతో సుఖప్రసవాలు