
హెచ్‌ఎంలే ఎంఈవోలు
ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యావ్యవస్థపై ఆజమాయిషీ లేకుండా పోతోంది. పర్యవేక్షించే అధికారులు లేక వ్యవస్థ గాడితప్పుతోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతుండగా.. మరోవైపు ఖాళీ పోస్టులు ఇబ్బందులు పెడుతున్నాయి. గత ఎస్సెస్సీ పరీక్షల్లో రాష్ట్రంలోనే ఐదో స్థానంతో అత్యుత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలో ఎంఈవో, ఉపాధ్యాయపోస్టుల ఖాళీలు విద్యాభిమానులను కలవరపెడుతున్నాయి. జిల్లాలోని 13 మండలాలతోపాటు సిరిసిల్ల, వేములవాడ టౌన్‌లలో ప్రధానోపాధ్యాయులనే మండల విద్యాధికారులుగా ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వం ఒకరికి మూడు నుంచి నాలుగు మండలాలకు ఇన్‌చార్జి ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హెచ్‌ఎంకు ఒక మండలం బాధ్యతలు అప్పగించడం కొంతవరకు ఉపశమనం కలిగించే అంశమే.
క్రమబద్ధీరణతోనే ఖాళీలు భర్తీ
ప్రభుత్వం జిల్లాను యూనిట్‌గా కాకుండా మండలాన్ని యూనిట్‌గా తీసుకుని పాఠశాలలను క్రమబద్ధీకరిస్తే ఖాళీలు ఉండబోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయంలో ఆలోచన చేస్తే ప్రభుత్వం క్రమబద్ధీకరణకు ముందుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. జిల్లాలో ఎస్జీటీ పోస్టులే 190 ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో గణితం 11, భౌతిక శాస్త్రం 6, బయోలజీ 12, సాంఘికశాస్త్రం 17, ఇంగ్లిష్ 10, తెలుగు 12, హిందీ 9, ఫిజికల్ డైరెక్టర్లు 6, స్పెషల్ టీచర్లు 8, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టులు 13, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీలు 7 ఖాళీగా ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్లు తెలుగు 6 ఖాళీయే. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి అశాసీ్త్రయంగా ఉండడంతోపాటు పలువురు 317 జీవోతో బదిలీలు కావడం, స్పౌజ్, ఇతర కారణాలతోపాటు, ఉద్యోగ విరమణ చేయడం ద్వారా ఖాళీలు ఏర్పడుతున్నాయి. జిల్లా విద్యాధికారిగా జెడ్పీ సీఈవో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జిల్లాలో పాఠశాలలు ఇలా..
ప్రాథమిక పాఠశాలలు 489
ప్రాథమికోన్నత 37
జెడ్పీ ఉన్నత 113
కస్తూరిబా విద్యాలయాలు 13
మోడల్ స్కూళ్లు 13
విద్యార్థుల సంఖ్య 48,382
ఉపాధ్యాయ ఖాళీలు(ఎస్జీటీ) 190
స్కూల్ అసిస్టెంట్ 131
విద్యాశాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు
జెడ్పీ సీఈవోకు డీఈవో బాధ్యతలు
విద్యాసంవత్సరం ఆరంభంలోనే బాలారిష్టాలు
‘ఇది ముస్తాబాద్ మండలం బందనకల్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ గతంలో నలుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. స్పౌజ్ విషయంలో ఇద్దరు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరు ఉండగా, అందులో ప్రధానోపాధ్యాయుడు ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 55 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ బడిబాటలో మరో 20 మంది చేరే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో కొద్ది రోజులపాటు పాఠశాలను ఒక్క టీచరే నెట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి టీచర్ల కొరత పాఠశాలు జిల్లాలోని మండలాల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినా ఖాళీలు ఉన్నాయి’.
విధులు నిర్వర్తిస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఈవోగా పనిచేస్తూనే హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాం. కొంత పని ఒత్తిడి ఉన్నా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నాం. ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాం. పాఠశాల నిర్వహణతోపాటు ఎంఈ వోగా పనిచేయడంతో ఒత్తిడి పెరుగుతోంది.
– నిమ్మ రాజిరెడ్డి, ఎంఈవో, ముస్తాబాద్
నియామకాలు చేపట్టాలి
విద్యాశాఖలో శాసీ్త్రయ పద్ధతిలో హేతుబద్ధీకరణ జరగాలి. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాలలో సంఖ్యతో సంబంధం లేకుండా విషయాల వారీగా నిపుణులు ఉండాలి. బదిలీలు, పదోన్నతులు క్రమం తప్పకుండా చేపట్టి నియామకాలు జరగాలి.
– పాతూరి మహేందర్‌రెడ్డి,
టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
‘ఇతను ముస్తాబాద్ ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి. సోమవారం ఉదయం 8 గంటలకే తాను హెచ్‌ఎంగా ఉన్న ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. 10 గంటల వరకు అడ్మిషన్లు, పాలనాపరమైన విధులు నిర్వర్తించి తర్వాత ఒంటి గంట వరకు హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మార్సీకి చేరుకుని నోట్‌బుక్స్ పంపిణీ చూసుకున్నారు. తెర్లుమద్దిలో మధ్యాహ్న భోజన విషయంలో తలెత్తిన వివాదంపై చర్చించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు పదోతరగతి విద్యార్థులకు మ్యాథ్స్ బోధించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై విద్యార్థులకు వివరించారు. ఒక్కరే అధికారి బహుముఖ సేవలతో తీరిక లేకుండా గడిపారు. ఇలా ఇతనొక్కరే కాదు.. జిల్లాలోని ఎంఈవోలందరిదీ ఇదే పరిస్థితి’.

హెచ్‌ఎంలే ఎంఈవోలు

హెచ్‌ఎంలే ఎంఈవోలు

హెచ్‌ఎంలే ఎంఈవోలు