
చినుకొస్తే మునకే !
● హైటెన్షన్‌లో లోతట్టు ప్రజలు ● పూర్తికాని వరదకాల్వ పనులు ● శాశ్వత పరిష్కారం కోరుతున్న స్థానికులు ● తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్న అధికారులు
సిరిసిల్లటౌన్: వర్షాకాలం వచ్చిందంటే చాలు సిరిసిల్ల పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. ఏటా వర్షాకాలంలో జిల్లా కేంద్రంలోని లోతట్లు ప్రాంతాలు జలమయం అవుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ప్రాణ, ఆస్తినష్టం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. పట్టణంలోని పై ప్రాంతం నుంచి వచ్చే వరదనీటిని కట్టడి చేయటంలో అధికారులు ఏళ్లుగా కుస్తీ పడుతూనే ఉన్నారు. అయినా సమస్య తీరడం లేదు. ఇటీవల తొలకరి జల్లులు కురిసిన సమయంలో పాతబస్టాండ్, సంజీవయ్యనగర్, శాంతినగర్‌లలోని రోడ్లు జలమయమయ్యాయి. చిన్నపాటి వర్షానికే ఇలాగైతే జోరు వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్లలోని లోతట్టు ప్రాంతాలపై ‘సాక్షి’ ఫోకస్.
సమస్యలు ఇవీ..
● పాతబస్టాండు సమీపంలో రూ.45లక్షలతో నిర్మించిన ప్రధాన డ్రైనేజీ కాల్వ పైనుంచి వచ్చే వరద నీటిని రోడ్డుపైకి రానీయకుండా పునరుద్ధరించాలి.
● పట్టణంలో వరదలు రాకుండా చేపడుతున్న కాల్వలు, రోడ్లు, డ్రైనేజీలు పూర్తికాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
● శాంతినగర్ ప్రాంతం నుంచి శ్రీనగర్ ప్రాంతం గుండా శాశ్వత వరదకాల్వ పనులు పూర్తికాలేదు.
● లోతట్టు ప్రాంతాలైన అంబికానగర్, వెంకంపేట, తారకరామానగర్, పద్మనగర్, అశోక్‌నగర్, అనంతనగర్, సర్ధార్‌నగర్, సంజీవయ్యనగర్, ఆసిఫ్‌పుర, ఆటోనగర్, శాంతినగర్‌లలో వరద చేరకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి.
● చెరువుల ఆక్రమిత నాలాలు, మత్తడికాల్వలు పునరుద్ధరిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశంపై అధికారులు, పాలకులు దృష్టి సారించడం లేదు.
ఇవిగో పరిష్కారాలు
పట్టణలలోని అన్ని చెరువులకు సంబంధించిన మత్తడి, నాలాలు పునరుద్ధరించాలి. లోతట్టు ప్రాంతాలకు ముంపు వాటిల్లకుండా ముందస్తు ప్రణాళికతో కొత్తనాలాలు నిర్మించాలి.
పాతబస్టాండులోని ఫుట్‌పాత్ కింద డ్రెయినేజీ పూర్తిగా సిల్టుతో నిండి దుర్గంధం వస్తుంది. పూర్తిస్థాయిలో క్లీన్ చేయించి, పెద్దబజారుకు వరదనీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలి.
ప్రధాన మురుగుకాల్వలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలి. సిల్టు పేరుకుపోకుండా నెలరోజులకోసారైనా శుభ్రం చేయాలి.
లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చే నీరు రోడ్డుపైకి రాకుండా..పటిష్ట కాలువలు కట్టించి నేరుగా మానేరువాగులో కలిసేలా చేయాలి.
ఇప్పటికే కబ్జాకు గురైనా నాలాలను స్వాధీనం చేసుకుని, పునరుద్ధరించాలి.

చినుకొస్తే మునకే !

చినుకొస్తే మునకే !

చినుకొస్తే మునకే !