
నేతన్నలు ‘త్రిఫ్ట్’లో చేరేందుకు చాన్స్
● నేడు, రేపు అవకాశం
సిరిసిల్ల: జిల్లాలోని నేతకార్మికులు త్రిఫ్ట్ పొదుపు పథకంలో చేరేందుకు మరో రెండు రోజులు గడువును పొడిగించారు. నేతకార్మికులకు సౌకర్యవంతంగా ఉండాలని సిరిసిల్ల బీ.వై.నగర్‌లోని పాతచేనేత, జౌళిశాఖ ఆఫీస్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. వస్త్రపరిశ్రమ అనుబంధరంగాల్లో పనిచేసే కార్మికులు ప్రతి నెలా గరిష్టంగా రూ.1,200 పొదుపు ఖాతాలో జమచేస్తే ప్రభుత్వం అంతే మొత్తం చెల్లిస్తుంది. ప్రతి నెలా కార్మికుడి పొదుపు ఖాతాలో రూ.2,400 జమకావడంతో వడ్డీతో సహా.. రెండేళ్ల తరువాత కార్మికులు పొందవచ్చు. ఈ త్రిఫ్ట్ పొదుపు పథకంలో చేరేందుకు తొలుత జూన్ 19 వరకు అవకాశం ఉండేది. దీంతో సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ పాత ఆఫీస్‌లో కార్మికులు గురువారం కిక్కిరిసిపోయారు. దీంతో దరఖాస్తులను ఇచ్చేందుకు మరో రెండు రోజులు శుక్ర, శనివారాల్లో అవకాశం కల్పించారు. పవర్‌లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు.