వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jun 18 2025 3:35 AM | Updated on Jun 18 2025 3:35 AM

వాతావ

వాతావరణం

ఆకాశం మేఘావృతమవుతుంది. గాలిలో తేమ ఉంటుంది. అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి.

కరెంట్‌ స్తంభాలను

తాకొద్దు

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి

ఫ్యూజ్‌వైరు పోతే హెల్పర్‌ను పిలవాలి

తుప్పు పట్టిన స్తంభాలను తొలగిస్తున్నాం

‘సాక్షి’తో ‘సెస్‌’ ఇన్‌చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ లోక శ్రీనివాస్‌రెడ్డి

సిరిసిల్ల: విద్యుత్‌ వినియోగం మనిషి జీవితంలో అనివార్యమైంది. కరెంట్‌ సరఫరా లేకుండా రోజు గడవడం కూడా కష్టమే. విద్యుత్‌ ఎంత అవసరమో.. దాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈనేపథ్యంలో వర్షాకాలంలో విద్యుత్‌ విషయంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) ఇన్‌చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ లోక శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాలో విద్యుత్‌ పంపిణీ సేవలు అందించే ‘సెస్‌’ పరంగా తీసుకుంటున్న చర్యలు, వానాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంగళవారం ‘సాక్షి’కి వివరించారు.. ఆ విశేషాలు.. ఆయన మాటల్లోనే..

కరెంట్‌ విషయంలో అజాగ్రత్త వద్దు

వర్షాకాలంలో ఇనుప స్తంభాలు, సిమెంట్‌ స్తంభాలు ఏవైనా వాటిని తాకవద్దు. వర్షాలకు అవి తడిసి ఉంటాయి. ఎర్తింగ్‌ సరిగా లేక షాక్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. మనుషులే కాకుండా, పశువులు సైతం స్తంభాలు, సపోర్టింగ్‌ వైర్లను తాకకుండా చూసుకోవాలి. ఇటీవల బోయినపల్లిలో ఓ గేదె విద్యుత్‌ షాక్‌తో మరణించింది. ముస్తాబాద్‌లో ఒకరు ఇంట్లోనే కరెంట్‌ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. కరెంట్‌ విషయంలో ఎవరూ అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నిండు ప్రాణాలు పోతాయి. అప్రమత్తంగా ఉండడమే మంచిది.

తుప్పుపట్టిన స్తంభాలను మార్చుతున్నం

జిల్లా వ్యాప్తంగా తుప్పుపట్టిన, వంగిపోయిన స్తంభాలను ఇప్పటికే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో మార్చాము. ఇంకా ఆయా మండలాల్లో 801 ప్రదేశాలను గుర్తించి స్తంభాలు మార్చేందుకు పరిపాలనా అనుమతులు తీసుకున్నాం. 643 స్తంభాల మార్పిడికి మంజూరు చేశాం. ఇంకా 158 మార్చేందుకు మంజూరు రావాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడ తుప్పు పట్టిన, ప్రమాదకరంగా స్తంభాలు ఉన్నా వెంటనే మార్చాలని మా క్షేత్రస్థాయి ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడికక్కడ పనులు జరుగుతున్నాయి.

రైతులు ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కవద్దు

జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్‌లపై ఫ్యూజ్‌ వైర్లు పోయినప్పుడు స్థానిక రైతులు, లేదా కొంత పరిజ్ఞానం ఉన్నవారు ‘సెస్‌’ హెల్పర్‌ సాయం తీసుకోకుండా.. నేరుగా ట్రాన్స్‌ఫార్మర్‌ హ్యాండిల్‌ కొట్టి ఫ్యూజ్‌వైర్లు వేస్తారు. ఇది తప్పు. కచ్చితంగా మా సిబ్బందితోనే వేయించాలి. కొంత ఆలస్యమైనా అదే శ్రేయస్కరం. కానీ, కొందరు వారే ఫ్యూజ్‌వైరు వేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి వెళ్తారు. అలాంటప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌ౖపై పూర్తిస్థాయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుండా, వేరే లైన్‌తో అనుసంధానమై సరఫరా ఉంటుంది. అది తెలియక ప్రమాదాలు జరుగుతాయి. రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కవద్దు. వ్యవసాయ మోటార్లు పెట్టేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చెప్పులు వేసుకోవాలి. తడి చేతులతో మోటార్లు, స్టార్టర్లను ముట్టవద్దు. విద్యుత్‌ వైరింగ్‌ సరిగా ఉందా లేదా అని ఎలక్ట్ట్రీషియన్‌తో చెక్‌ చేయించాలి. వైర్ల ఇన్సిలేషన్‌ తొలగిపోయి ప్రమాదాలు జరుగుతాయి. ముందు చూపుతో వ్యవహరించాలి.

విద్యుత్‌ అంతరాయాన్ని కట్టడి చేసేందుకు..

విద్యుత్‌ అంతరాయాన్ని కట్టడి చేసేందుకు జిల్లాలో ముందస్తుగానే వర్షాకాల విద్యుత్‌ లైన్ల నిర్వహణను పూర్తి చేశాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. వైర్ల కింద ఉన్న చెట్లు, కొమ్మలను తొలగించాం. ‘సెస్‌’ క్షేత్రస్థాయి సిబ్బందికి సేఫ్టీ కిట్లను అందించాం. ఇంకా పంపిణీ చేసేందుకు కొనుగోలుకు ప్రతిపాదించాం. వానాకాలంలో విద్యుత్‌ ఇన్‌డెక్షన్‌ వస్తుంది. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించాం.

సమర్థవంతంగా సేవలు

జిల్లావ్యాప్తంగా ‘సెస్‌’ ద్వారా సమర్థవంతంగా విద్యుత్‌ పంపిణీ సేవలు అందిస్తున్నాం. జిల్లాలో 2,04,571 కనెక్షన్లు ఉన్నాయి. ఇవి కాకుండా వ్యవసాయ కనెక్షన్లు 79,449 ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. 10,626 ట్రాన్స్‌ఫార్మర్లు, 76 సబ్‌స్టేషన్లతో లో ఓల్టేజీ లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. గృహజ్యోతి పథకంలో 1,05,746 మందికి 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ప్రభుత్వం ప్రతి నెలా రూ.4.11 కోట్లు గృహజ్యోతి పథకంలో చెల్లిస్తుంది. పవర్‌లూమ్స్‌కు 25 హెచ్‌పీల వరకు 50 శాతం సబ్సిడీతో విద్యుత్‌ అందిస్తున్నాం. వేసవిలో గరిష్టంగా మే నెలలో రూ.22.27 కోట్ల విలువైన విద్యుత్‌ వినియోగించాం. వినియోగదారుల నుంచి రూ.14.47 కోట్ల బిల్లులు వసూలు చేశాం. కరెంట్‌ వైరింగ్‌లో ఇంట్లో కానీ, పరిశ్రమల్లో, వ్యవసాయ క్షేత్రాల్లోనైనా ఏ మాత్రం అనుమానం వచ్చినా ఎలక్ట్రీషియన్‌తో చెక్‌ చేయించుకోవడం మంచిది. వర్షాకాలంలోనే కాదు.. అన్ని కాలాల్లోనూ కరెంట్‌ విషయంలో ముందు జాగ్రత్త ఎంతో మేలు.

కరెంట్‌ ప్రమాదాల్లో పరిహారం

విద్యుత్‌ ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు ‘సెస్‌’ ద్వారా పరిహారం చెల్లిస్తాం. నిజానికి సంస్థ పరంగా ఏదైనా పొరపాటు ఉంటేనే పరిహారం ఇవ్వాలి. కానీ, మానవత్వంతో మా పొరపాటు లేకపోయినా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ప్రాణం అమూల్య మైంది. 2025లో మూడు కేసులు నమోదు కాగా, చనిపోయిన ఘటనలో రూ.5 లక్షలు, గేదె చనిపోతే రూ.40వేలు, గొర్రె చనిపోతే రూ.7 వేలు పరిహారం చెల్లించాం. కరెంట్‌ సరఫరాలో ఏ మాత్రం ఇబ్బందులు ఎదురైనా మా సిబ్బందికి సమాచారం అందించాలి. కొంచెం.. వెనకా ముందు.. తప్పకుండా వస్తారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మా దృష్టి తీసుకురావాలి.

వాతావరణం
1
1/1

వాతావరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement