ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవండి
● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు సూచించారు. మూడో విడత పంచాయతీ ఎ న్నికల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్ మద్దతుదారులైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లను సిరిసిల్ల లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం సత్కరించా రు. కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెసోళ్లు ఎన్ని గెలిచారో గుర్తులేదన్నారు. నియోజకవర్గంలో 117 గ్రామాలుండగా.. 80 గ్రామాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. కొన్ని గ్రామాల్లో మనోళ్లే ఇద్దరు, ముగ్గురు పోటీపడడంతో కొందరు ఓడిపోయారని.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయని, అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. సిరిసిల్ల ప్రాంతంలో 57 ఎంపీటీసీ స్థానాలు, ఐదు జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని.. క్లస్టర్ల వారీగా పార్టీ నాయకులు పనిచేసి విజయం సాధించాలన్నారు.
ఎగిరింది గులాబీ జెండా
సిరిసిల్ల గడ్డపై గులాబీ జెండా ఎగిరిందని, ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్‌ఎస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడం గర్వకారణమన్నారు. గంభీరావుపేట వంటి మండలాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని స్పష్టం చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ ‘పల్లెప్రగతి’ ద్వారా గ్రామాలను నందనవనాలుగా తీర్చిదిద్దారన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో ట్రాక్టర్లలో డీజిల్ పోయించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌ఈడీ బల్బులు మార్చే దిక్కు లేక పల్లెలు చీకటిగా మారాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ సాధించిన విజయాన్ని చూసి భయపడి, ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
కలిసికట్టుగా పనిచేయండి
సర్పంచ్ ఎన్నికల సమయంలో వచ్చిన చిన్నపాటి విభేదాలను పక్కనపెట్టి, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట కోసం పనిచేయాలని కేటీఆర్ కోరారు. 117 పంచాయతీల పరిధిలోని 57 ఎంపీటీసీ స్థానాలను క్లస్టర్ల వారీగా సమీక్షించుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులకు సంక్రాంతి తర్వాత శిక్షణ(వర్క్‌షాప్) ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ‘సెస్’ చైర్మ న్ చిక్కాల రామారావు, రాజన్నసిరిసిల్ల జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ‘సెస్’ వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, పార్టీ నాయకులు కల్వకుంట్ల గోపాల్‌రావు, వరుస కృష్ణహరి, రాజిరెడ్డి, సురేందర్‌రావు, వెంకటస్వామి, కుంబాల మల్లారెడ్డి పాల్గొన్నారు.


