తోడు కోసం..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మంచుదుప్పటి కమ్ముకుంటున్న వేళ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. చలి గజగజ వణికిస్తున్న సమయంలో పెద్దపులి వచ్చిందన్న వార్తలతో పల్లెల్లో వాతావరణం వేడెక్కింది. కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతంలో పెద్దపులి(టైగర్) పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు రాజన్నసిరిసిల్ల జిల్లా సరిహద్దులోని అడవిని ఆనుకుని ఉన్న గ్రామీణులను అప్రమత్తం చేస్తున్నారు. పెద్దపులి జిల్లాలోకి వచ్చిందన్న ప్రచారం నేపథ్యంలో పల్లెల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. వచ్చింది ఆడపులా.. మగపులా తెలియదు. అయితే తోడు కోసం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
మేటింగ్ టైం..
శీతాకాలం ప్రధానంగా పెద్దపులులకు పునరుత్పత్తి సమయం కావడంతోనే తోడును వెతుక్కుంటూ జిల్లాలోకి ప్రవేశించి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. గతేడాది కూడా ఇదే సమయంలో ఈ ప్రాంతంలోకి పెద్దపులి వచ్చి వెళ్లింది. ఆ సమయంలోనూ అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మళ్లీ ఈ సంవత్సరం కూడా శీతాకాలంలోనే పులి వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. జిల్లా సరిహద్దు మండలం దోమకొండ ప్రాంతంలో పొలాల వద్ద కట్టేసిన పశువులపై దా డిచేసిన సంఘటనలు దీనికి బలాన్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. పెద్దపులి నిత్యం 50 కిలోమీటర్లు సంచరిస్తుందని.. కాబట్టి జిల్లా సరిహద్దుల్లోని పల్లెప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అవగాహనతో అప్రమత్తం
కామారెడ్డి–రాజన్నసిరిసిల్ల జిల్లాల సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాలు రత్నగిరిపల్లి, బంజేరుపల్లి, సోమారిపేట, గజసింగవరం, రాచర్లతిమ్మాపూర్, రాచర్లగుండారం, మద్దిమల్ల గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దంటున్నారు. అదే సమయంలో తమ పశువులను పొలాల వద్ద కాకుండా ఇంటి పరిసరాల్లోనే కట్టుకోవాలని సూచిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో చిరుతపులులు పొలాల వద్ద కట్టేసిన పశువులపై దాడిచేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు రైతులను, పల్లెప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పెద్దపులి మరింత ప్రమాదకారి కావడంతో రైతులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని సూచిస్తున్నారు. రాత్రి పూట పొలాల వద్దకు వెళ్లవద్దంటున్నారు.
తోడు కోసం..


