
ఎదురుచూపులే..
యువ వికాసం
● లబ్ధిదారులకు నిరీక్షణే ● జూన్ 2న ప్రారంభిస్తామని వాయిదా ● ఆన్‌లైన్ దరఖాస్తులు.. ఆఫ్‌లైన్ విచారణ... ఇంటర్వ్యూలు ● అర్హుల ఎంపిక పూర్తి.. అమలు జాప్యం
దరఖాస్తులు ఇలా..
ఎస్సీ : 8,865
ఎస్టీ : 1,943
బీసీ : 23,243
మైనార్టీ : 1,606
క్రిస్టియన్ : 39
ఈబీసీ : 1,123
మొత్తం : 36,819
ఇతను బండ రాజనర్సయ్య. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన రాజనర్సయ్య గేదెల పెంపకానికి రూ.2లక్షల రుణం కోసం రాజీవ్ యువవికాసంలో దరఖాస్తు చేశారు. అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించారు. జూన్ 2న మంజూరుపత్రం ఇస్తామని అధికారులు ప్రకటించారు. కానీ బ్యాంకు లోన్ ఇప్పటి వరకు రాలేదు. గేదెల పెంపకం యూనిట్ గ్రౌండింగ్ కాలేదు.
సిరిసిల్ల: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యమవుతోంది. జిల్లాలో ప్రధానమైన వ్యవసాయరంగంతోపాటు, అనుబంధ రంగాలను, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించి యువతను స్వయం ఉపాధి మార్గంలో నడిపించే సదాశయంతో ప్రారంభించిన యువవికాసం పథకాన్ని జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించాలని హడావుడి చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మండల, మున్సిపల్ స్థాయిల్లో ముఖాముఖీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందిస్తామని ప్రకటించిన అధికారులు.. ప్రభుత్వ నిర్ణయంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు మంజూరుపత్రాలు అందిస్తారో ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు.
ఐదు విడతల్లో మంజూరుపత్రాలు
● కేటగిరీ–1లో రూ.50వేలు, కేటగిరీ–2లో రూ.లక్ష వరకు ఉండే యూనిట్లను మొదటి విడతలో జూన్ 9 వరకు మంజూరు చేసి 15వ తేదీలోగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు మంజూరుపత్రాలు ఇవ్వలేదు. ఫలితంగా శిక్షణ ఊసే లేదు. కేటగిరీ–1, 2లో జిల్లా వ్యాప్తంగా 3,919 మంది ఉన్నారు. ఐదు విడతల్లో మంజూరుపత్రాలు ఇవ్వాలని భావించినప్పటికీ మొదటి విడతకే ముహూర్తం కుదరడం లేదు.
ప్రభుత్వ ఆదేశాలు రావాలి
జిల్లాలో రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. కలెక్టర్ ఆదేశాలతో కేటగిరీ 1, 2 లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. బ్యాంకర్లు సైతం కాన్‌సెంట్ ఇచ్చారు. రాజీవ్ యువవికాసం అమలుకు ప్రభుత్వ ఆదేశాలు రావాల్సి ఉంది. – స్వప్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
కేటగిరీ వారీగా యూనిట్ల వివరాలు
కేటగిరీ యూనిట్ విలువ యూనిట్లు
(అన్ని సామాజిక
వర్గాలు)
1 రూ.50వేలు 2,148
2 రూ.50వేలు – రూ.లక్ష 1,771
3 రూ.లక్ష – రూ.2లక్షలు 1,587
4 రూ.2లక్షలు – రూ.3లక్షలు 372
5 రూ.3లక్షలు – రూ.4లక్షలు 308
6 రూ.2లక్షలు – రూ.4 లక్షలు 924
7 బోర్‌వెల్స్ 08
8 ఎనర్జీ ఓఆర్‌సీ 02
9 సోలార్ ప్యానెల్స్ 01
ఇతను తెంబరవేణి రాజు. తంగళ్లపల్లికి చెందిన రాజు కుట్టుమిషన్ షాపు కోసం రాజీవ్ యువ వికాసం పథకంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణం వస్తే స్వయం ఉపాధి పొందాలనుకున్నాడు. కానీ ఇప్పటి వరకు యువ వికాసం యూనిట్లు గ్రౌండింగ్ కాలేదు.. ఇలాంటి పరిస్థితి జిల్లాలో 7,121 మంది అర్హులది.

ఎదురుచూపులే..

ఎదురుచూపులే..

ఎదురుచూపులే..