
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
● ఆరేళ్ల కొడుకును చితక్కొట్టిన తల్లి ● చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి ● సిరిసిల్లలో కన్నతల్లి కర్కశత్వం
సిరిసిల్లటౌన్: మాతృత్వం మంటగలిసింది. కన్నతల్లి కర్కశత్వం ఆరేళ్ల చిన్నారికి నూరేళ్లు నింపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నకొడుకునే చితకబాది అతడి మృతికి కారణమైంది. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం విషాదం నింపింది. పోలీసులు, చిన్నారి నానమ్మ అనసూయ, స్థానికుల కథనం ప్రకారం.. సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌కు చెందిన మంగళారపు అరుణ్‌కు అదే ప్రాంతానికి చెందిన మాధవితో చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు ఆదిత్రి(9), కొడుకు ఆరుష్(6) ఉన్నారు. అరుణ్ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి మాధవి స్థానిక వెంకంపేటలో ఉంటోంది. ఆదిత్రి, ఆరుష్ నానమ్మ, తాతయ్య వద్ద ఉండగా.. కొద్దిరోజుల క్రితం మాధవి వారితో గొడవపడి పిల్లలను బలవంతంగా తీసుకెళ్లింది. అయితే మాధవి కొద్దిరోజులుగా వెంకపేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు సమాచారం. పిల్లలిద్దరూ ఇంటివద్దనే ఉంటుండడంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించిన మాధవి ప్రియుడితో కలిసి వారిని తీవ్రంగా హింసిస్తున్నారు. మంగళవారం కూడా ఆరుష్‌ను తీవ్రంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయాడు. ఆరుష్ నానమ్మ అనసూయ ఫిర్యాదు మేరకు మాధవితోపాటు ఆమె ప్రియుడు బాలకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. నిందితులిద్దరిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.