
గ్రీవెన్స్‌డేతో సమస్యలు పరిష్కారం
● ఎస్పీ మహేష్ బీ గీతే ● 18 ఫిర్యాదులు స్వీకరణ
సిరిసిల్లక్రైం: ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 18 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు పరిష్కరించాల్సిందిగా సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు.
మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
● డీఆర్‌డీవో శేషాద్రి
సిరిసిల్ల: జిల్లాలో మరో మూడు రోజుల్లో ధా న్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శేషాద్రి సోమవారం తెలిపారు. జిల్లాలో 242 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 35,902 మంది రైతుల వద్ద ఇప్పటికే 2,40,695 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. జిల్లాలో సేకరించిన ధాన్యం విలువ రూ.558 కోట్లని, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా.. సజా వుగా కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాలో పూ ర్తి స్థాయిలో మూడు రోజుల్లో వడ్లను కొనుగోలు చేస్తామని శేషాద్రి స్పష్టం చేశారు.
నేడు పెద్దింటి కథా కార్యశాల
సిరిసిల్లకల్చరల్: తెలంగాణ సాహిత్య అకాడమీ సారథ్యంలో మంగళవారం కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ నిర్వహణలో కార్యశాల(వర్క్‌షాప్) నిర్వహించనున్నారు. హైదరాబాద్ మినీరవీంద్రభారతిలో జరిగే కార్యశాలలో ఔత్సాహిక కథారచయితలకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అతిథులుగా హాజరవుతారని, సకాలంలో హాజరుకావాలని అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి కోరారు.
తూనికలు, కొలతలశాఖ అధికారుల తనిఖీలు
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. స్థానిక పాతబస్టాండు, గాంధీచౌక్ ప్రాంతాల్లోని బేకరీలు, స్వీట్‌షాపులు, కిరాణ దుకాణాల్లో సోదాలు చేశారు. ప్యాకేజీ వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని గుర్తించి ఐదు దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే 94925 34843లో ఫిర్యాదు చేయాలని కోరారు. తూనికలు, కొలతల శాఖ కరీంనగర్ జోనల్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, జిల్లా అధికారి ఆర్.రూపేశ్‌కుమార్, సిబ్బంది గంగరాములు, శ్రీనివాస్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని సింగారం శివారులోని దర్శావళిగుట్ట వద్ద ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈక్రమంలోనే రెవెన్యూ అధికారులు సోమవారం విచారణ జరిపి కబ్జాదారుడికి నోటీసులు జారీ చేశారు. కబ్జా చేసిన ఎకరం బంచరాయి భూమి వ్యవహారంలో కబ్జాచేసిన వ్య క్తితో ఓ రాజకీయపార్టీ నాయకులు రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. కబ్జాచేసిన భూమిని రికవరీ చేసుకునే విషయంలో రెవెన్యూ అధికారులు చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది.

గ్రీవెన్స్‌డేతో సమస్యలు పరిష్కారం

గ్రీవెన్స్‌డేతో సమస్యలు పరిష్కారం