
సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయంగా పాలన
ధర్మారం: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణా అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ధర్మారంలోని మోడల్ స్కూల్ నుంచి ఎండపల్లి క్రాస్‌రోడ్డు వరకు రూ.3.20 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీరోడ్డు పనులకు ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకువడ్డీలు చెల్లిస్తూనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీనెల తొలివారంలోనే వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందని ఆమె స్పష్టం చేశారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పెగడపల్లి: కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధికి పాటుపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. పెగడపల్లి మండలంలోని కీచులాటపల్లి కేంద్రంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో రూ.20కోట్ల తో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ పథకం కింద నియోజకవర్గానికి 3500 ఇళ్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నామని వివరించారు. సన్నబియ్యం కొనలేని స్థితిలో ఉన్న పేదల కోసం దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందిస్తూ, పేదలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ధర్మపురి అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్‌అండ్‌బీ సీఈ సమత, డీపీఓ మదన్‌మోహన్, ఈఈ శ్రీనివాస్, సీఈఓ గౌతం రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శోభారాణి, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
సన్నబియ్యం పంపిణీ ప్రతిష్టాత్మకం
నిరుపేదలు సన్నబియ్యంతో అన్నం తినాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీతక్క అన్నారు. నర్సింహునిపేటకు చెందిన దళితురాలు తాండ్ర లక్ష్మి ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. దొడ్డుబియ్యం తినేందుకు ఇబ్బందిపడ్డామని, సన్నబియ్యం ఇవ్వడంతో ఇంటిల్లిపాదిభోజనం చేస్తున్నామని లక్ష్మి తెలిపారు.
సీతక్కకు ఘన స్వాగతం
ధర్మపురి: పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు జిల్లాకు వచ్చిన మంత్రి సీతక్కకు మండలంలోని రాయపట్నం వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. శ్రీలక్ష్మినృసింహుడి ఫొ టో, ప్రసాదాలు అందించారు. ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రఘుచందర్ బందోబస్తును ఏర్పాటు చేశారు.