వరద వచ్చినా సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వరద వచ్చినా సిద్ధం

May 28 2025 6:05 PM | Updated on May 28 2025 6:05 PM

వరద వచ్చినా సిద్ధం

వరద వచ్చినా సిద్ధం

● ముందస్తు రుతుపవనాలతో ఇరిగేషన్‌శాఖ అప్రమత్తం ● ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి గేట్ల నిర్వహణ షురూ ● పనుల కోసం టెండర్లు పిలిచిన అధికారులు ● ఎల్‌ఎండీలో మొదలైన పనులు, ఎంఎండీ, ఎల్లంపల్లివి జూన్‌లో ● వరదకు ముందే అప్రమత్తంగా ఉండేలా చర్యలు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో రాష్ట్రంలో తొలకరి పలకరిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈసారి అసాధారణరీతిలో దాదాపు రెండువారాల ముందే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటిపారుదలశాఖ వానాకాలానికి ముందస్తుగానే గేట్ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రుతుపవనాలు ముందుగా రావడంతో ఈ పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే లోయర్‌ మానేరు డ్యాం అధికారులు గేట్ల నిర్వహణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు టెండర్లు ఖరారవగా.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేరు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ప్రీ మాన్‌సూన్‌, పోస్ట్‌ మాన్‌సూన్‌ల కాలంలో గేట్ల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏటా ఏం చేస్తారు?

సాధారణంగా ఏటా వర్షాకాలానికి ముందే.. నీటిపారుదలశాఖ అధికారులు గేట్ల నిర్వహణకు పూనుకుంటారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం ప్రతీ డ్యాం వద్ద వర్షాకాలానికి ముందు(ప్రీ మాన్‌సూన్‌), వర్షాకాలానికి తరువాత (పోస్ట్‌ మాన్‌సూన్‌) గేట్ల లూబ్రికేషన్‌ ప్రక్రియను చేపడతారు. వరద సమయంలో గేట్లు సులువుగా పైకి లేచేందుకు లూబ్రికేషన్‌ దోహదపడుతుంది. ఇందులో భాగంగా వాల్వ్‌ గేర్‌బాక్స్‌లకు కూడా గ్రీస్‌ పూయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జనరేటర్ల పనితీరును సమీక్షిస్తారు. వీటిని ప్రతీ ఐదు రోజులకు ఒకసారి దాదాపు 5 నిమిషాలపాటు అనివార్యంగా పనిచేయిస్తారు. ఇలాంటి భారీ జనరేటర్ల్లు ప్రతీ ప్రాజెక్టు వద్ద రెండు వరకు ఉంటాయి. వీటితోపాటు లిఫ్ట్‌లు, మెకానిక్‌ టూల్స్‌, ఇతర ఎలక్ట్రిక్‌ వస్తువులను కూడా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఎల్‌ఎండీ అధికారులు రూ.13లక్షల నుంచి రూ.15లక్షల వరకు టెండరు పిలవగా.. ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లికి సంబంధించి రూ.38లక్షలకు టెండరు ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్‌మానేరుకు సంబంధించి దాదాపు రూ.26 లక్షలతో తాజాగా టెండరు పిలిచారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు జూన్‌లో మొదలు కానున్నాయి.

వరద అవకాశాలు అంతంతే..

సాధారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ఉన్న సమయంలో ప్రాజెక్టుల్లో నీరు చెప్పుకోదగ్గస్థాయిలో ఉండేది. వీటికి వర్షాలు తోడైనపుడు ప్రాజెక్టులు వేగంగా నిండి గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది. దాదాపుగా ఏడాదిన్నరగా ఎత్తిపోతలు నిలిచిపోయిన దరిమిలా మునపటి తరహాలో ప్రాజెక్టులలో నీటిమట్టాలు లేవనే చెప్పాలి. ఒకవేళ భారీగా కుండపోత వర్షాలు కురిసి, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తేనే మన ప్రాజెక్టులు నిండి, గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రాజెక్టు సామర్థ్యం గేట్లు ఎల్‌ఎండీ 24 టీఎంసీ 20 ఎంఎండీ 27.5 టీఎంసీ 25 ఎల్లంపల్లి 20 టీఎంసీ 62

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement