సిరిసిల్ల: జిల్లాలో వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసేందుకు మంగళవారం ఇంటర్వ్యూలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన నిర్వహించారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించగా, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఒక్క అభ్యర్థి, కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక్క ల్యాబ్ మేనేజర్ పోస్టుకు ఆరుగురు, ఐదు ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు 11 మంది హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎస్.రజిత, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
నేతకార్మికుల ఉపాధికి ఆర్డర్లు
● చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు
సిరిసిల్ల: నేతకార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తుందని సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు జి.రాఘవరావు పేర్కొన్నారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటలో మైండ్‌కేర్, కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మనోవికాస సదస్సులో మాట్లాడారు. సిరిసిల్ల పవర్‌లూమ్ పరిశ్రమకు మహిళాశక్తి చీరల ఆర్డర్లు ఇచ్చామని, నేతన్నలకు చేతినిండా పని కల్పించే సంక్షేమశాఖల వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించామన్నారు. ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ స్కూల్ యూనిఫామ్స్, మరికొన్ని ప్రైవేట్ ఆర్డర్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. సెకాలజిస్ట్ కె.పున్నంచందర్ మాట్లాడుతూ ఆత్మహత్య ఆలోచనలు, మానసిక సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా ఆస్పత్రిలోని మైండ్‌కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్‌లో సంప్రదించాలని కోరారు. కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయలు పాల్గొన్నారు.
యోగా శిక్షణ షురూ..
వేములవాడ: అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల సందర్భంగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’ అనే నినాదంతో హరితయోగా, యోగావాక్, యోగా సంగమం, యోగా ప్రభావ అనే నాలుగు కార్యక్రమాలు మంగళవారం ప్రారంభించినట్లు ఆయుష్ జిల్లా నోడల్ అధికారి శశిప్రభ తెలిపారు. జూన్ 21 వరకు గ్రామ, మండలస్థాయిలో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఓల్డ్ అర్బన్‌కాలనీలోని కమ్యూనిటీహాల్‌లో 30 మంది హాజరయ్యా రు. డీపీఎం తిరుపతి, ఫార్మసిస్ట్ పుష్పలత, శిక్షకులు ఎలిగేటి కృష్ణ, ఆశవర్కర్లు లత, హేమలత, ఉమ, జయ, విజయ, రమ్య ఉన్నారు.
వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ సీపీఐ
కరీంనగర్: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సీపీఐ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సీపీఐ కరీంనగర్ జిల్లా 23వ మహాసభలు నగరంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకుడు వేముల వెంకట్రాజం, అమరవీరుల స్మారకస్తూపం చిహ్నాన్ని శ్రీరాముల రామచంద్రం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులను దూరం చేసుకుని అధికారాన్ని పోగొట్టుకున్నామనే బాధలో బీఆర్‌ఎస్ ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులు లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలన్నారు. నాయకులు మర్రి వెంకటస్వామి, సభ్యుడు కలవేన శంకర్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్, బో యిని అశోక్, అందెస్వామి, టేకుమల్ల సమ్మ య్య, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.