చేపా చేపా ఎక్కడికెళ్లావు | - | Sakshi
Sakshi News home page

చేపా చేపా ఎక్కడికెళ్లావు

May 28 2025 6:05 PM | Updated on May 28 2025 6:59 PM

ముస్తాబాద్‌ పెద్ద చెరువు

ముస్తాబాద్‌ పెద్ద చెరువు

ఈసారి చేప విత్తనాల పంపిణీ లేనట్లే

గతేడాది కూడా అందని వైనం

జిల్లాలో 1.42కోట్ల చేపపిల్లలు.. 48 లక్షల రొయ్యలు డిమాండ్‌

మత్స్యకారులకు ఉపాధి దూరం 

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు పంపిణీ చేసేది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువుల్లో ఉచిత చేపపిల్లలు పంపిణీ చేయడం ద్వారా గ్రామాల్లో మత్స్యకారులు చేపలు పట్టుకొని ఉపాధి పొందేవారు. అయితే గతేడాదిగా ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలు పంపిణీ చేయడం లేదు. జిల్లాలో నీటివనరుల్లో నీరు పుష్కలంగా ఉన్నా మత్స్యకారులకు ఉపాధి కరువైంది. చేపపిల్లల పంపిణీపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

మత్స్యశాఖలో ప్రణాళిక కరువు

జిల్లాలో 48 మత్స్యకార సొసైటీల్లో 8,421 మంది కార్మికులు ఉన్నారు. వీరికి ఉపాధి కల్పించేందుకు మత్స్యశాఖ ఫిబ్రవరి, మార్చిలోనే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టాలి. జిల్లాలో 1.42కోట్ల చేపపిల్లలు అవసరం కాగా.. అందుకు అనుగుణంగా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి, సైజు, నాణ్యతను బట్టి టెండర్‌ అప్పగించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో మధ్యమానేరు, ఎగువమానేరు ప్రాజెక్టులలో కొంతమేరకు చేపపిల్లలను వదిలారు. కానీ, 440 చెరువులకు పిల్లలను సరఫరా చేయలేదు. మత్స్య సహకార సొసైటీలు, ఆ శాఖ అధికారులకు మధ్య సమన్వయలోపం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఏటా జిల్లాకు అవసరమైన రూ.1.60 కోట్ల బడ్జెట్‌పై ముందస్తుగా ప్రతిపాదనలు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలు చేయలేదని సమాచారం.

చేపల పెంపకం.. సొసైటీలపై భారం

గతేడాది ప్రభుత్వం నుంచి చేపపిల్లలు రాకపోవడంతో జిల్లాలో మత్స్యకార్మికులే సొంతంగా డబ్బులు వెచ్చించి చేపపిల్లలను కొనుగోలు చేశారు. ముస్తాబాద్‌, గంభీరావుపేట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని మత్స్యకార్మికులు తమ సొసైటీల ద్వారా డబ్బులు ఖర్చు చేసుకుని చేపపిల్లల పెంపకాన్ని చేపట్టారు. దీంతో ఆయా సొసైటీలపై ఆర్థిక భారం పడుతోందని కార్మికులు పేర్కొంటున్నారు. ఒక్క ముస్తాబాద్‌ సొసైటీ పరిధిలోని ఐదు చెరువుల్లో గతేడాది రూ.4లక్షలు వెచ్చించి చేపపిల్లలను వదిలారు. వాటినే ఏడాది పొడవునా పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఏటా వచ్చే భారీ వరదలతో చెరువులు మత్తళ్లు దూకి చేపపిల్లలు కొట్టుకుపోతున్నాయని, చేప పిల్లల రక్షణకు అవసరమైన జాలీలు, వలలు ఇవ్వాలని మత్స్యకార్మికులు కోరుతున్నారు.

నాణ్యతే అసలు సమస్య

ప్రభుత్వం చేపపిల్లల సరఫరాకు ఏటా టెండర్‌ ని ర్వహిస్తుండగా.. కాంట్రాక్టు దక్కించుకున్న వారు ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేపవిత్తనాలు సరఫరా చే స్తారు. అయితే ఇక్కడ చేప పిల్ల సైజు, దాని రకం, నాణ్యతపై కార్మికులకు అవగాహన ఉండదు. చెరువులో వదిలే సమయంలో చేపపిల్లల సంఖ్యను కూడా ఎవరూ లెక్కించే పరిస్థితి ఉండదు. దీంతో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పిల్లల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించి సరఫరా చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా..

చేపపిల్లల డిమాండ్‌ 1.42 కోట్లు

రొయ్యపిల్లల డిమాండ్‌ 48 లక్షలు

చెరువులు 440

ప్రాజెక్టులు: ఎగువ మానేరు, మధ్యమానేరు, అన్నపూర్ణ

మత్స్యకార సొసైటీలు 48

మత్స్యకార్మికులు 8,421

చేపా చేపా ఎక్కడికెళ్లావు1
1/1

చేపా చేపా ఎక్కడికెళ్లావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement