
ఉరుములు..మెరుపులు..వర్షం
సిరిసిల్ల: జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపడి ఇల్లంతకుంట మండలం గొల్లపెల్లికి చెందిన గొర్రెలకాపరి దాసరి లక్ష్మణ్(21) మృతిచెందాడు. పక్కనే ఉన్న మరో గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. సిరిసిల్లలోని లోతట్టు ప్రాంతాలు వెంకంపేట, పాతబస్టాండు, సంజీవయ్యనగర్, ఆసిఫ్‌పుర, ఆటోనగర్, శాంతినగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రగతినగర్‌లో వేపచెట్టు విరిగి విద్యుత్‌తీగలపై పడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
పొంగిపొర్లిన వాగులు
వేములవాడ మండలం హన్మాజిపేట వద్ద నక్కవాగు నిండుగా పారింది. చందుర్తి మండలంలో భారీగా కురిసిన వర్షాలతో నక్కవాగు పొంగిపొర్లింది. తంగళ్లపల్లి మండలం సండ్రవాగు, ఇల్లంతకుంటలోని బిక్కవాగుల్లో వరద పారింది. మానేరువాగు, మూలవాగులకు వరదనీరు మోసుకొచ్చే ఒర్రెలు పారాయి. కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో వర్షాలతో వడ్లు తడిసి మొలకొచ్చాయి. తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో బస్తాల్లోనే మొలక వచ్చింది.
వర్షపాతం ఇలా..
వేములవాడ మండలం నాంపల్లి వద్ద అత్యధికంగా 102.5 మిల్లీమీటర్ల వర్షం నమోదుకాగా.. అత్యల్పంగా గంభీరావుపేటలో 3.3 మిల్లీమీటర్లు న మోదైంది. చందుర్తి మండలం మర్రిగడ్డ వద్ద 81.5, కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో 72.0, బోయినపల్లిలో 63.0, ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో 56.3, కోనరావుపేట మండలం మర్తనపేటలో 53.5, వేములవాడ మండలం మల్లారంలో 52.8, వీర్నపల్లిలో 52.3, కలెక్టరేట్ వద్ద 52.0, పెద్దూరులో 43.5, నామాపూర్‌లో 31.0, కందికట్కూర్‌లో 30.5, ఎల్లారెడ్డిపేటలో 22.0, నేరెళ్లలో 21.5, రుద్రంగిలో 21.5, వట్టెంలలో 20.0, ఇల్లంతకుంటలో 20.0, పెద్దలింగాపూర్‌లో 16.0, మానాలలో 16.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లా అంతటా వర్షం
వేములవాడ: పట్టణంలోని రోడ్లపై వరదనీరు ప్రవహించింది. రాజన్న గుడి ముందు పెద్ద ఎత్తున వరదనీరు చేరిపోవడంతో మోకాళ్లలోతు వరదనీటిలో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
కోనరావుపేట: మండలంలో 74 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వీర్నపల్లి: మండలంలోని వన్‌పల్లిలోని రామలక్ష్మణ్ చెరువులోకి నీరు చేరుతుంది.
రుద్రంగి: మండలంలో కూరగాయల తోటలు నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లంతకుంట: మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. వెల్జీపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ధాన్యం కుప్పల చుట్టూ వర్షపు నీరు చేరింది. మండలంలో తూకం వేసిన దాదాపు 30వేల బస్తాలు తడిసిపోయాయి. వల్లంపట్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ కూలింది.
ఎల్లారెడ్డిపేట: మండలంలోని వెంకటాపూర్ శివారులోని ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. అక్కపల్లి శివారులోని లేతమామిండ్లవాగు వరదనీటితో పొంగిపొర్లింది.
ఇల్లంతకుంటలో పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి
సిరిసిల్లలో విరిగిపడిన చెట్లు.. నిలిచిన విద్యుత్ సరఫరా
లోతట్టు ప్రాంతాలు జలమయం
పొంగిపొర్లిన నక్కవాగు, లేతమామిండ్లవాగు

ఉరుములు..మెరుపులు..వర్షం