మిమ్మల్ని గెలిపించుకుంటా... | - | Sakshi
Sakshi News home page

మిమ్మల్ని గెలిపించుకుంటా...

Jul 18 2025 5:06 AM | Updated on Jul 18 2025 5:06 AM

మిమ్మల్ని గెలిపించుకుంటా...

మిమ్మల్ని గెలిపించుకుంటా...

● నన్ను మీరే గెలిపించారు ● గెలుపు గుర్రాలను మీరే గుర్తించండి ● బయటి వాళ్లు అక్కర్లేదు ● మీరు మీరు కొట్లాడుకోవద్దు ● స్థానిక సంస్థల ఎన్నికలంటే కాంగ్రెస్‌ భయపడుతుంది ● సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు

సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని నేను గెలిపించుకుంటా.. నన్ను మీరే గెలిపించారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అన్నీ నేను చూసుకుంటానని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో గురువారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్‌ మండలాల బీఆర్‌ఎస్‌ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశనం చేశారు. కేటీఆర్‌ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని, ఎన్నికలకు ముందు కాంగ్రెసోళ్లు కూడా గెలుస్తామని అనుకోలేదన్నారు. అనుకోకుండా వచ్చిన అధికారంతో ఆగమవుతున్నారన్నారు.

ఎరువుల కోసం మళ్లీ గోస వచ్చింది

రాష్ట్రంలో ఎరువుల కోసం చెప్పులతో క్యూ కట్టే రోజులు మళ్లీ వచ్చాయన్నారు. వ్యవసాయంపై మన నేత కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపారని, నారుమళ్ల సమయానికి ఎరువులు సిద్ధం ఉండేవని గుర్తు చేశారు. కేసీఆర్‌ హయాంలో వాగులో నిండుగా నీళ్లుంటే ఇప్పుడు ఎడారిని తలపిస్తుందన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 15 రిజర్వాయర్లు, మూడు బ్యారేజ్‌లు, 21 పంపులతో నీటిని ఎత్తిపోశారని కేటీఆర్‌ గుర్తు చేశారు. కొండపోచమ్మ సాగర్‌ వద్ద 618 మీటర్ల ఎత్తుకు నీళ్లు తెచ్చిండని, 139 మెగావాట్ల బాహుబలి మోటార్లతో ఎత్తిపోతల ద్వారా మనకు నీటి సరఫరా వ్యవస్థను కేసీఆర్‌ తయారు చేసిండన్నారు. 24 గంటల కరెంట్‌, రైతుబంధు, రైతుబీమాతో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయన్నారు.

సిరిసిల్లలో పైసా పంచకుండా గెలిచాను

కల్యాణలక్ష్మి పథకంతో ఆడబిడ్డల వివాహానికి అండగా నిలిచామని, అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. నేను సిరిసిల్లకు వస్తే చాలా సంతోషపడతానని, ఒక్క రూపాయి పైసలు పంచకుండా, మందు చుక్క పోయకుండా గెలవడం నాకు గర్వంగా ఉందన్నారు. ఇది నేను, మీరు అందరం గర్వపడే విషయమని పేర్కొన్నారు. పరిపాలన పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి చారిత్రాత్మకమన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మన ఎంపీటీసీ కుంటయ్య మరణం నన్ను తీవ్రంగా బాధించిందని, వారికి కుటుంబ బాధ్యత నేను తీసుకున్నానని కేటీఆర్‌ అన్నారు. ప్రజలంతా కేసీఆర్‌ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఎవరికీ భయపడేది లేదని, మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసిపెట్టుకుంటున్నాని స్పష్టం చేశారు.

అన్ని స్థానాలు మనవే..

ప్రతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. అన్ని స్థానాల్లో మనమే గెలవాలని, రాష్ట్రంలోని 269 జెడ్పీటీసీ స్థానాల్లో గెలవబోతున్నామన్నారు. అధికార పార్టీకి ధీటుగా పనిచేద్దామన్నారు. మన గెలుపే వాళ్ల బలుపుకు సమాధానం కావాలన్నారు. గ్రామాల్లో యూరియా కొరత ఉంది, దీంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని, మీరు స్థానిక సమస్యలపై కొట్లాడాలని పిలుపునిచ్చారు. గతంలో గ్రామ పంచాయతీలకు అనేక అవార్డులు వస్తే.. ఇప్పడు ఒక్కటీ దిక్కులేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీసీ సోదరులను మళ్లీ కాంగ్రెస్‌ మోసం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ.. మన పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఒక్క తంగళ్లపల్లి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో సమావేశాన్ని వాయిదా వేశారు. మండలాల వారీగా జరిగిన ఈ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, కొండూరి రవీందర్‌రావు, తోట ఆగయ్య, చిక్కాల రామారావు, న్యాలకొండ అరుణ, అన్ని మండలాల మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సింగిల్‌ విండో చైర్మన్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement