ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
కోనరావుపేట(వేములవాడ): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందిన సంఘటన కోనరావుపేట మండలం ధర్మారంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. ధర్మారం గ్రామానికి చెందిన మల్యాల దేవయ్య(48) స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం వరికోత మిషన్ ద్వారా కోసిన వడ్లను కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నాడు. ఈక్రమంలోనే ఓ రైతు పొలం వద్ద ట్రాక్టర్ ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచి కిందికి దిగాడు. హఠాత్తుగా ట్రాక్టర్ ముందుకు కదలడంతో ఆపే క్రమంలో కాలు జారి టైర్ కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ దేవయ్యను సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మృతునికి భార్య దేవవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
మల్కపేటలో వృద్ధుని అదృశ్యం
కోనరావుపేట (వేములవాడ): మల్కపేటకు చెందిన కట్లె పర్శయ్య(65) ఆచూకీ రెండు నెలలుగా లభించడం లేదు. పర్శయ్య గత ఫిభ్రవరి 7న పింఛన్ డబ్బుల కోసం ఆటోలో సిరిసిల్లకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎంపీడీవో కార్యాలయం తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల పరిషత్ కార్యాలయాన్ని బుధవారం డీపీవో, మండల ప్రత్యేకాధికారి ఎండీ.షరీఫుద్దీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటుచేసిన రాజీవ్ యువవికాసం హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. అనంతరం రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.లక్ష్మీనారయణ, ఎంపీవో మీర్జా బేగ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బండలింగంపల్లిలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి విగ్రహా లను రథంపై ఏర్పాటు చేసి శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
మురుగునీటి సరఫరా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కాలనీలో బుధవారం సైతం నల్లా ద్వారా మురుగునీరు సరఫరా అయింది. దీంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాలనీలో గత పది రోజుల క్రితం మురుగునీరు సరఫరా కావడంతో చాలా మంది చర్మవ్యాధులతో ఇబ్బంది పడ్డారన్నారు. మళ్లీ బుధవారం సైతం మురికినీరు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి


