బంగారం అమ్మి ఇల్లు కట్టి !
ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ ఇచ్చిన అధికారులు బిల్లు కోసం వెళ్తే మంజూరు కాలేదన్న వైనం లబోదిబోమంటున్న బాధిత కుటుంబం ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతోనే తప్పిదం
గంభీరావుపేట(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మంజూరుపత్రం ఇస్తే ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉండి ముగ్గుపోస్తే.. బంగారం విక్రయించి ఇంటి నిర్మాణం చేపట్టారు. తీరా బిల్లులు వచ్చే సమయంలో ఇల్లే మంజూరుకాలేదని సమాధానం ఇవ్వడంతో ఆ కుటుంబం వేదన అంతా.. ఇంతా కాదు. ఇద్దరి మహిళల పేర్లు ఒకేలా ఉండడంతోనే తప్పిదం జరిగినట్లు తెలుస్తుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌కు చెందిన బండ బాలమణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు గ్రామసభలో ప్రకటించారు. ఆన్‌లైన్ పేరుతో ఫొటోలు తీసుకున్నారు. గత జూన్‌లో ప్రొసీడింగ్స్ అందించారు. ఇల్లు మంజూరైందనే ఆనందంలో తన వద్ద ఉన్న నగలను అమ్మి, మరికొంత అప్పు చేసి బేస్‌మెంట్, గోడల వరకు నిర్మించారు. బేస్‌మెంట్ బిల్లు కోసం అధికారుల వద్దకు వెళ్తే.. ఇల్లే మంజూరు కాలేదనడంతో ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. బండ బాలమణి భర్త బాలయ్య అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, బేస్‌మెంట్ బిల్లు సైతం వారి బ్యాంక్ ఖాతాలో పడిందని అధికారులు గుర్తించారు. అనంతరం ఆరా తీయగా బండ బాలమణి భర్త బాలయ్య, బండ బాలమణి భర్త శ్రీనివాస్ వేర్వేరు కుటుంబాలు అని గుర్తించారు. వెంటనే వారి ఖాతాలో జమయిన అమౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. దీంతో బాధిత కుటుంబం లబోదిబోమంటుంది. ఇల్లు నిర్మించుకున్నారు కదా.. బిల్లులు చెల్లిద్దామని అధికారులు ఆలోచిస్తుండగా.. వారు అనర్హులు అని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కట్టుకున్న తమ పరిస్థితి ఏంటని బాధిత కుటుంబం ప్రశ్నిస్తుంది. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని చెబుతున్న అధికారులు మంజూరుపత్రాల్లో భర్త పేరు నమోదు చేయకపోవడంతోనే ఈ తప్పిదం జరిగినట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం నిరుపేద కుటుంబాన్ని అప్పుల్లోకి నెట్టేసింది.
నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు
ముగ్గుపోసే సమయంలో పక్కనే కార్యదర్శి(ఫైల్)
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఒకరికి బదులు మరొకరికి ఇంటి మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఒకే పేరుతో ఇద్దరు మహిళలు ఉన్నారు. కానీ వారి భర్తల పేర్లు వేర్వేరుగా ఉన్నాయి. ఒకరికి ఇవ్వాల్సిన ప్రొసీడింగ్స్ కాపీని వేరొకరికి అందించారు. వారు ఇల్లు కట్టుకున్నారు. బిల్లు విషయానికి వచ్చేసరికి అసలు విషయం తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించాం.
– శ్రీధర్, ఎంపీడీవో, గంభీరావుపేట
బంగారం అమ్మి ఇల్లు కట్టి !


