
వస్త్రోత్పత్తి ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయండి
● నూలును వస్త్రోత్పత్తిదారులు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు ● టెస్కో సీజీఎం వెంకటేశ్వర్‌రావు ● సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులతో సమీక్ష
సిరిసిల్ల: ప్రభుత్వం ఇచ్చిన వస్త్రోత్పత్తి ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలని టెస్కో చీఫ్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్‌రావు కోరారు. స్థానిక ఇంది రానగర్ ఏఎంసీ గోదాంలో శనివారం వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాలు, మహిళాశక్తి చీరల ఉత్పత్తులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఇప్పటికే స్కూల్ యూనిఫామ్స్‌కు సంబంధించి 1.05 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చామని, మహిళాశక్తి చీరలకు సంబంధించి 2.12 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించినట్లు తెలిపారు. నూలు డిపో ద్వారా పరిమితమైన మ్యాక్స్‌లకు సరఫరా అవుతుందని, ఆర్థికంగా ఉన్న యజమానులు నేరుగా కొనుగోలు చేసి వస్త్రాలను తయారు చేయాలన్నారు. టెస్కో జీఎం అశోక్‌రావు మాట్లాడుతూ ఇతర వస్త్రాల ఉత్పత్తులను పక్కన పెట్టి ప్రభుత్వం అందించిన ఆర్డర్ల బట్టను ఉత్పత్తి చేయాలని కోరారు. ఆర్డర్లను ఆలస్యం చేస్తే.. భవిష్యత్‌లో ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిరిసిల్లకు రాకుండా పోతాయని వివరించారు. ముందుగా ఆర్వీఎం వస్త్రాలను అందించాలని కోరారు. ఓఎస్‌డీ హిమజకుమార్, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, డీవో రవీందర్‌రెడ్డి, నూలు డిపో ఇన్‌చార్జి శంకరయ్య, సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు గోవిందు రవి, తాటిపాముల దామోదర్, బూట్ల నవీన్‌కుమార్, మండల బాలరాజు, యెల్దండి శంకర్, వేముల దామోదర్, చిమ్మని ప్రకాశ్, బీమని రామచంద్రం పాల్గొన్నారు.