ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే అసంపూర్తి కాలువ పనులు ప్రారంభిస్తామని.. దీక్ష విరమించాలని రంగనాయక సాగర్ ప్రాజెక్టు డీఈ సీతారామ్, డీటీ సత్యనారాయణ, ఆర్‌ఐ షఫీ రైతులను కోరారు. రైతులు దీక్ష చేస్తున్న శిబిరాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు. ఎమ్మెల్యే లేదా ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని రైతులు స్పష్టం చేయడంతో అధికారులు వెనుదిరిగారు.
కాల్వ పనులు ప్రారంభించాలి
రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఎల్‌ఎం–6 కెనాల్ పనులు ప్రారంభించకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ హెచ్చరించారు. పెద్దలింగాపూర్‌లో రైతులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన రూ.3కోట్లు విడుదల చేసి, కాల్వ పనులు ప్రారంభించాలని కోరారు. సీపీఎం నాయకులు గన్నారం నర్సయ్య, జవ్వాజి విమల, రైతులు కరికె నవీన్, గాదె మధుసూదన్, అమ్ముల అశోక్, పయ్యావుల బాలయ్య పాల్గొన్నారు.