
తడగొండలో ప్రతిష్టించిన పీర్లు
● వారం రోజుల పాటు వేడుకలు ● 29న మొహర్రంతో ఉత్సవాల ముగింపు
బోయినపల్లి(చొప్పదండి): పల్లె ఒడిన పీర్ల పండుగ కొత్త శోభను తెచ్చిపెట్టింది. గ్రామాల్లో హిందు, ముస్లిం భేదం లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పీర్ల పండుగ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వారం రోజుల పాటు పీర్ల పండుగ ఉత్సవాలు నిర్వహించడం గ్రామాల్లో అనాదిగా వస్తున్న ఆచారం. మండలంలోని తడగొండ, బోయినపల్లి తదితర గ్రామాల్లో పీర్లను ప్రతిష్టించారు. ఈ నెల 29న జరిగే మొహర్రం పర్వదినంతో ఉత్సవాలు ముగుస్తాయి.
మలీద ముద్దలు.. బెల్లం శాక..
గ్రామాల్లో పూర్వ కాలం నుంచి గ్రామ చావడి లేదా మసీదుల్లో పీర్లను ప్రతిష్టిస్తారు. పీర్లు ప్రతిష్టించిన ప్రదేశం ముందు అలాం (గుండం) నిర్మిస్తారు. నిర్వాహకులు రోజు సాయంత్రం పీర్లకు మలీద ముద్దలు, బెల్లం శాక, ఊదు బెల్లం చదివిస్తారు. అనంతరం పీర్లను ఊరేగిస్తారు. పీర్లను ఊరేగించే సమయంలో కొందరికి పూనకం వస్తుంది. గ్రామాల్లో ఇలాంటి వారిని పీర్ల దేవుడు వచ్చిండు అంటారు. వారు పీర్లను పట్టుకుని ఉత్సాహంగా తిరుగుతారు.
చిన్న చెరుగత్.. పెద్ద చెరుగత్
పీర్లు ప్రతిష్టించిన ఐదోరోజు చిన్న చెరుగత్ పేరిట చిన్న మట్కీలు తీస్తారు. అనంతరం మళ్లీ మొహర్రంకు ఒక రోజు ముందు పెద్ద చెరుగత్‌తో పెద్ద మట్కీలు తీస్తారు. పీర్ల దేవునికి మొక్కుకున్న వారు మట్కీలు తీస్తారు. అంటే భక్తి శ్రద్ధలతో చేసిన మలీద ముద్దలు, బెల్లం శాక, శెనగ పప్పు, బగార బువ్వను కుండలో పెట్టి కుండను ఎత్తుకుని వెళ్లి పీర్లకు చదివిస్తారు. వారం పాటు నిర్వహించే ఉత్సవాలు మొహర్రం పర్వదినం రోజు నిర్వహించే పీర్ల నిమజ్జనంతో ముగుస్తాయి. ఊరేగింపులో పలువురు పీర్లకు దట్టీలు, బుట్టెలు, కుడుకుల పేర్లు, కొత్త వస్త్రాలు కడతారు. అనంతరం పీర్ల నిమజ్జనం చేస్తారు. పీర్ల ప్రతిష్ట ముందు నిర్మించే అలాం చుట్టూ రోజు హిందూ, ముస్లిం భేదం లేకుండా అసోయి దూలా.. అంటూ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతారు.
వారం పాటు ఉత్సవాలు
బోయినపల్లిలో పీర్ల ప్రతిష్ట చేయడం జరిగింది. వారం పాటు ఉత్సవాలు చేస్తాం. రోజూ ఊదు, బెల్లం శాక పీర్లకు చదివిస్తాం. అలాగే చిన్న చెరుగత్, పెద్ద చెరుగత్ రోజు మట్కీలు తీసి ఉత్సవాలు చేస్తాం. ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో పాల్గొంటారు. – తాజొద్దీన్, బోయినపల్లి
హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీక
తడగొండ గ్రామంలో చాలా ఏళ్లుగా పీర్ల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొంటారు. చాలా మంది మలీద ముద్దలు, బగార బువ్వతో మట్కీలు తీస్తారు. మొహర్రంకు ముందు ఉదయం అగ్ని గుండం చుట్టూ పాటలు పాడుతూ జోష్‌గా ఆడుతారు. – ఎండీ. అహ్మద్‌హుస్సేన్, తడగొండ

