రెండేళ్లుగా అభాగ్యులను నిర్లక్ష్యం చేస్తున్నారు అర్హులకు సైతం సదరం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు జెడ్పీ సమావేశంలో దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వేసవిలో రైతులకు కరెంటు కొరత లేకుండా చూడాలని సూచన చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందన్న ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మా...
సమావేశంలో మాట్లాడుతున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పాల్గొన్న సభ్యులు
జెడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పక్కన జేసీలు
ఒంగోలు సిటీ:
కొత్త పింఛన్లు ఇవ్వకుండా అభాగ్యులను చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తోందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వకుండా వేధిస్తోందని, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు సైతం ఇవ్వడం లేదని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సకాలంలో పింఛన్లు ఇచ్చామని ఆయన తెలిపారు. ఒంగోలు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో బూచేపల్లి మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి పింఛన్ల విషయంలో అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. వేసవి కాలంలో ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చాలని కోరారు. ప్రధానంగా విద్యుత్ సరఫరా విషయంలో అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించాలి : ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు
రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వ్యవసాయశాఖ అధికారులను కోరారు. ఎనిమిది నెలలుగా తుఫాన్ నష్టపరిహారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు లోన్ల కోసం బ్యాంకులకు వెళితే ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. బీమా కంపీనీలతో మాట్లాడి వెంటనే పంట నష్టపరిహారం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు సైతం సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందని విమర్శించారు. గత సంవత్సరం దళారులు సిండికేటై మామిడి రైతులను నట్టేట ముంచేశారన్నారు. ఈసారైనా అధికారులు మేల్కొని మామిడి రైతులకు అండగా నిలవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మేలు జరిగేంత వరకూ తాము పోరాటం చేస్తామన్నారు. వచ్చే జెడ్పీ సమావేశం నాటికి జిల్లాలో రైతులకు అందాల్సిన పరిహారం మొత్తం అందించాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కనీస గౌరవ వేతనం ఇవ్వడం లేదని తూమాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొలుత జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ కార్యకలాపాలపై సమీక్షించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, గృహనిర్మాణ శాఖ, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్ శాఖల కార్యకలాపాలు, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల) కార్యకలాపాలకు సంబంధించి గత సమావేశంలో చేసిన తీర్మానాలపై సమీక్షించి ఆమోదించారు. అలాగే జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘాల తీర్మానాలను ఆమోదించారు.
కలెక్టర్ల గైర్హాజరుపై సభ్యుల
ఆందోళన...
కనీసం సభ్యుల సమస్యలు తీర్చడానికి కూడా రెండు జిల్లాల కలెక్టర్లు హాజరుకాకపోవడం బాధాకరమని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగండ్ల మండలంలో 2016–17 సంవత్సరంలో అప్పటి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 18 ఆర్వో ప్లాంట్లు మంజూరు చేశారని, అవి ప్రస్తుతం మెయింటెనెన్స్ లేకపోవడంతో మూలనపడ్డాయని, వాటిని కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా గ్రామాల్లో కనీసం తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పంటలు కొనేవారు లేరని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎంతో కీలకమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. జెడ్పీ సమావేశానికి రాకుండా ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో రైతులు అవస్థపడుతున్నారు. ప్రస్తుత వేసవిలో చాలా ప్రాంతాల్లో నీటి సమస్యలున్నాయి. వాటి గురించి కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ పాలకుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


