ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే గిట్టుబాటు ధరలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే గిట్టుబాటు ధరలు

May 3 2026 10:22 AM | Updated on May 3 2026 10:22 AM

ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే గిట్టుబాటు ధరలు

పొగాకు రైతుల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నాయకులు

ఒంగోలు టౌన్‌: ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే పొగాకు రైతులకు న్యాయం జరుగుతుందని, లేకపోతే గిట్టుబాటు ధరలు లభించడం కష్టమేనని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు పిలుపునిచ్చారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో శనివారం పొగాకు రైతుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పమిడి వెంకటరావు మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఏర్పడిన పొగాకు బోర్డు కంపెనీలతో మిలాఖత్‌ అయి రైతులను దగా చేస్తోందని విమర్శించారు. ఆరుగాలం కష్టించి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తేగానీ పొగాకుకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి జజ్జూరి జయంతిబాబు మాట్లాడుతూ గతేడాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వేలం కేంద్రాల చుట్టూ తిరిగారని, ఈ ఏడాది ఒక్కరు కూడా వేలం కేంద్రం వైపునకు రాలేదని తెలిపారు. గతేడాది క్వింటా రూ.28 వేలు ప్రకటించి కొనుగోలు చేస్తేనే కొద్దిపాటి నష్టంతో రైతులు బయటపడ్డారని, ఈ ఏడాది గతం కంటే తగ్గించి రూ.25 వేలకు కొనుగోలు చేస్తే బ్యారన్‌కు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోందని వివరించారు. గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా ఈ ఏడాది 49 శాతానికి పెంచి రైతులను నిండా ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పొగాకు బోర్డు, మరోవైపు కంపెనీలు రైతులను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. సమావేశంలో ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీరారెడ్డి, రైతు సంఘ జిల్లా నాయకుడు పరిటాల కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి బాలకోటయ్య, సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు, రైతు నాయకులు టి.శ్రీకాంత్‌, బెజవాడ శ్రీను, కనపర్తి సుబ్బారావు, వేజండ్ల సింగయ్య, ముప్పరాజు బ్రహ్మయ్య, వాసు, మల్లికార్జునరావు, తుళ్లూరి వెంకటరావు పాల్గొన్నారు. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 18వ తేదీ పొగాకు సదస్సు నిర్వహించాలని సమావేశం తీర్మానం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement