వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మే డే వేడుకల్లో నాయకులు మే డే జెండా ఆవిష్కరించిన జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
ఒంగోలు సిటీ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న హయాంలోనే కార్మికుల సంక్షేమం కొనసాగిందని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గురవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు హాజరై మే డే జెండా ఆవిష్కరించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్మిక సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. వెట్టి చాకిరి కొనసాగుతున్న రోజుల్లో కార్మికులకు కచ్చితంగా నిర్ణీత పనిగంటలు ఉండాలనే డిమాండ్‌తో 8 గంటలు మాత్రమే పనిదినాలు కావాలని పోరాటం చేసి కొందరు కార్మికులు ప్రాణాలు అర్పించారన్నారు. 1890 మే 1వ తేదీ నుంచి 8 గంటల పనిదినాలు కల్పించి ప్రారంభించారన్నారు. ఆ రోజు నుంచి మే 1వ తేదీ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. కార్మికులందరూ సంతోషంగా ఉండాలని, జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, మహిళా నాయకులు మేరికుమారి, వైఎస్సార్ సీపీ నాయకులు యలమందారెడ్డి, మీరావలి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, పిగిలి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


