ఒంగోలు సబర్బన్: ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించే రైతులను ప్రోత్సాహిస్తూ ప్రతి రైతు బజారులో స్టాల్స్ కేటాయించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. రైతు బజార్ల బలోపేతంలో భాగంగా ఉద్యానవన, పౌర సరఫరాలు, మున్సిపాలిటీ, తూనికలు, కొలతలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులతో శుక్రవారం ఆమె చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ అగ్రి ట్రేడ్ – మార్కెటింగ్ అధికారి వరలక్ష్మి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. రైతులు వారి కూరగాయలను రైతు బజార్లలో ప్రత్యక్షంగాగానీ, ఆసక్తి కలిగిన వారు పరోక్ష పద్ధతిలో మంచి ధరకుగానీ అమ్ముకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక గ్రూపులకు రైతు బజార్లలో డీఆర్‌డీఏ ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేయాలని చెప్పారు. రైతు బజార్లలో మంచినీటి సౌకర్యం కల్పించి మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ సుభాషిణి, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి పద్మశ్రీ, రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


