మార్కాపురం రూరల్: మార్కాపురం మండలంలోని ఇడుపూరు, తదితర గ్రామాల్లో మైనింగ్, రెవెన్యూ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాలపై సాక్షి దినపత్రిక 8వ పేజీలో ఏప్రిల్ 30వ తేదీ ‘కొండలు తొలిచి.. కోట్లు దోచి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కొంతకాలంగా రాత్రింబవళ్లు మట్టి అక్రమ రవాణా జరుగుతూనే ఉన్నప్పటికీ అఽధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దానిపై సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురించడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించడం చర్చనీయాంశమైంది. అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు హెచ్చరించారు. ఇకపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు మాత్రం ఈ చర్యలన్నీ తాత్కాలికం కాకుండా శాశ్వతంగా కొనసాగాలని, మట్టి మాఫియాపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


