బల్లికురవ/అద్దంకి/దొనకొండ:
ప్రకాశం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం సంభవించిన అగ్ని ప్రమాదాల్లో పంట పొలాలు, ఓ ఇల్లు దగ్ధమయ్యాయి. కాల్చిన సిగరెట్ పీకను ఆర్పకుండా పొలంలోకి విసరడంతో ఎనిమిది ఎకరాల్లో సుబాబుల్ తోట అగ్నికి ఆహుతైన ఘటన బల్లికురవ మండలంలోని ఉపమాగులూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాంబశివరావు, నాగేశ్వరరావు, వీరయ్య ఎనిమిది ఎకరాల్లో సుబాబుల్ సాగు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ ఆర్పకుండా విసరడంతో ఒకరి తోటలో నుంచి మరొకరి తోటలోకి మంటలు వ్యాపించాయి. సుమారు రూ.8 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు.
గృహోపకరణాలు దగ్ధం
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన అద్దంకి పట్టణంలోని రామ్‌నగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న మోటుపల్లి శ్రీనివాసరావు గృహంలో విద్యుత్ మోటారు షార్ట్‌సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసేలోగా ఒక వాషింగ్ మెషిన్, విద్యుత్ మోటారు కాలిపోయాయి. రూ.50 వేల నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు.
బూడిదైన మొక్కజొన్న పంట
అద్దంకి మండలంలోని చిన్నకొత్తపల్లిలో విద్యుత్ లైన్ జంపర్ తెగి నిప్పు రవ్వలు పడటంతో మొక్కజొన్న తోటలో మంటలు చెలరేగాయి. గ్రామానికి చెందిన చెన్నుపాటి స్వాములు రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పొలంలోని విద్యుత్ తీగ జంపర్ తెగి నిప్పు రాజుకోవడంతో పంట పూర్తిగా కాలిపోయింది. రూ.1.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు చెప్పారు.
రుద్రసముద్రంలో..
దొనకొండ మండలంలోని రుద్రసముద్రం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు చెలరేగి మొక్కజొన్న పంట కాలిపోయింది. రైతు చెన్నుబోయిన శ్రీను రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా పంట కోతకు వచ్చింది. పొలం గట్టుపైన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి మొక్కజొన్న తోటకు అంటుకున్నాయి. రూ.1.20 లక్షల విలువైన పంట, రూ.35 విలువ గల డ్రిప్ పైపులు మంటల్లో బూదిదయ్యాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పు తీరుతుందనుకుంటున్న తరుణంలో కళ్ల ముందే పూర్తిగా దగ్ధమైందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.


