తాళ్లూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన దరిమిలా టీడీపీ నేతలు అధికార దర్పం ప్రదర్శిస్తుండగా.. అధికారులు కూడా అందుకు వంతపాడుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఆహ్వానం పంపకపోగా శిలాఫలకాలపై సైతం నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేత జి.లక్ష్మి ఫొటోలు పెట్టడం గమనార్హం. తాళ్లూరు మండంలంలోని తురకపాలెంలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ, చిన్నపాటి చప్టా నిర్మించారు. వీటి ప్రారంభోత్సవ శిలాఫలకాలపై ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే బూచేపల్లి ఫొటో ముద్రించాల్సి ఉంది. అధికారులు అత్యుత్సాహంతో టీడీపీ నేత జి.లక్ష్మి ఫొటో పెట్టి స్వామిభక్తిని చాటుకున్నారు.
చీమకుర్తి రూరల్: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన చీమకుర్తి మండలంలోని రామతీర్థం సెంటర్‌లో ఒంగోలు–కర్నూలు రోడ్డుపై శుక్రవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కూనంనేనివారిపాలెం గ్రామానికి చెందిన రాతికింది గోపి(33) ఒంగోలు జీజీహెచ్‌కు వెళ్లి తన బైక్‌పై చీమకుర్తి వస్తున్నాడు. ఈ క్రమంలో ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో గోపి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చీమకుర్తి సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్‌లో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు జీజీహెచ్‌లో మార్చురీ వద్ద మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు.
వలేటివారిపాలెం: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో పాస్టర్ మృతి చెందిన సంఘటన వలేటివారిపాలెం మండలంలోని రోళ్లపాడు అడ్డ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. వలేటివారిపాలేనికి చెందిన సీహెచ్ సేనాపుత్ర పాస్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె బిలారాణి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేస్తోంది. శుక్రవారం కందుకూరు చేరుకున్న ఆమెను తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో రోళ్లపాడు అడ్డ రోడ్డు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. దీంతో రోడ్డుపై పడిపోయిన సేనాపుత్ర, బిలారాణికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు గమనించి 108లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సేనాపుత్ర (45) మృతి చెందారు. బిలారాణి స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వేసవి సెలవులకు ఇంటికి వస్తున్న కుమార్తెను తీసుకొస్తూ తండ్రి మృతి చెందంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ల ముందే తండ్రి మృతి చెందడాన్ని చూసి బిలారాణి గుండెలవిసేలా రోదిస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కనిగిరి రూరల్: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద మార్చి 26న టూరిస్ట్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన ఆరుగురు, తీవ్ర గాయాలపాలైన 14 మంది కుటుంబ సభ్యులకు శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ సహాయ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో క్షతగాత్రుడికి రూ.2 లక్షలు, మృతుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి రూ 5 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
దర్శి నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించని అధికారులు
శిలాఫలకాలపై దర్శి ఎమ్యెల్యేకు బదులు టీడీపీ నేత ఫొటో


