మార్కాపురం: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్కాపురంలోని గిరిజన గురుకుల పాఠశాలలో 3 నుంచి 8వ తరగతి వరకూ బ్యాక్‌లాగ్ ఖాళీల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రిన్సిపల్ నాగమల్లీశ్వరి బుధవారం తెలిపారు. మూడో తరగతిలో ఎస్‌టీలకు 10, ఎస్సీలకు 5, బీసీలకు 2, ఓసి 1, పీహెచ్‌సి 1 సీట్లు ఉన్నాయన్నారు. 4 నుంచి 8వ తరగతి వరకూ ఖాళీగా ఉన్న సీట్లు కేవలం ఎస్‌టీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తామన్నారు. అప్లికేషన్లను స్థానిక గిరిజన గురుకుల పాఠశాలలో తీసుకొని భర్తీ చేసి వచ్చేనెల 20వ తేదీలోపు ఇవ్వాలని తెలిపారు. వివరాలకు 83339 25183, 77025 32468 నంబర్లను సంప్రదించాలన్నారు.
ఐనముక్కల గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో..
పెద్దదోర్నాల: మండల పరిధిలోని ఐనముక్కలలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నూర్జహాన్ తెలిపారు. వివిధ తరగతులకు సంబంధించి ఖాళీగా ఉన్న సీట్లను రిజర్వేషన్ల దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తారన్నారు. పూర్తి వివరాలకు 75694 30300 నంబర్‌కు సంప్రదించాలని ఆమె కోరారు.
ఒంగోలు: ఒంగోలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వి.పల్లవిని నియమిస్తూ ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె గాజువాక 3వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తూ ఒంగోలుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈస్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.హేమలతను హిందూపూర్‌కు బదిలీ చేశారు. ఒంగోలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ ఇబ్రహీం షరీఫ్‌ను శ్రీకాకుళానికి, శ్రీకాళహస్తిలో విధులు నిర్వహిస్తున్న బి.బేబీరాణిని చీరాలకు, ఏలూరులో బాధ్యతలు నిర్వహిస్తున్న కేకేవి బులికృష్ణను కందుకూరు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలోని గ్రామాల రూపురేఖలను మార్చుతూ పరిశుభ్రంగా పచ్చదనంతో ఉంచాలని కలెక్టర్ విజయసునీత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ పథం కార్యక్రమం అమలు పోస్టరును పంచాయతీరాజ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. గ్రామాల్లో రహదారుల వెంట ఉన్న చెత్తకుప్పలను తొలగించి రోడ్లను ఆకర్షణీయంగా ఉంచాలన్నారు. ఇప్పటి నుంచి ప్రతి బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని తెలిపారు. పీఆర్–1 యాప్‌లో కార్యక్రమ వివరాలను అప్‌లోడ్ చేయాలన్నారు. ఎంపీడీఓలు పర్యవేక్షణ చేసి ఉన్నతాధికారులకు పురోగతి నివేదికలు పంపాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, డీఎల్‌పీఓ బాలూనాయక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


