మార్కాపురం మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ముఖ్య నేత అండతో అడ్డగోలుగా గ్రావెల్‌ దందా? | - | Sakshi
Sakshi News home page

మార్కాపురం మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ముఖ్య నేత అండతో అడ్డగోలుగా గ్రావెల్‌ దందా?

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

మార్కాపురం మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ముఖ్య నేత అండతో అడ్డగోలుగా గ్రావెల్‌ దందా?

అర్ధరాత్రి వేళ.. పదుల సంఖ్యలో టిప్పర్లు రోడ్డుపై రొదపెడుతూ దూసుకెళ్తున్న దృశ్యాలు మార్కాపురం పరిసరాల్లో నిత్యకృత్యంగా మారాయి. చెరువు గర్భాల్లో.. కొండ అంచుల వెంట జేసీబీలు, పొక్లెయిన్లు చేస్తున్న చప్పుడు అంతా ఇంతా కాదు. ఇదంతా అభివృద్ధిలో భాగం అసలే కాదు. సంపద సృష్టి కోసం మట్టి మాఫియా చేస్తున్న ధ్వంస రచన. ఈ సొమ్మంతా జిల్లా ఖాజానాకో, రాష్ట్ర ఖజానాకో చేరుతుందనుకుంటే పొరపాటే. అక్రమ గ్రావెల్‌ మైనింగ్‌తో ఆర్జించిన డబ్బంతా టీడీపీ చోటా నేతల గల్లా పెట్టెలు, ముఖ్య నేతల భోషాణాల్లోకి వెళ్తోంది. చెరువులను చెరబట్టి, కొండలను పిండి చేస్తున్నా రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ ముఖ్యనేత అండతో గడిచిన రెండేళ్లుగా రోజుకు సరాసరిన 150 నుంచి 200 టిప్పర్ల గ్రావెల్‌, వందలాది ట్రాక్టర్ల మట్టిని ఆ పార్టీ నాయకులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యంగా మారింది.

కొండలు తొలిచి..

రూ.కోట్లు దోచి!

మార్కాపురం రూరల్‌:

టీడీపీ నేతల ధన దాహార్తికి మార్కాపురం మండలంలోని చెరువులు, గుట్టలు, కొండలు గుల్లవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా టీడీపీ చోటా నాయకుల నుంచి బడా నేతల వరకు ధనార్జనే ధ్యేయంగా సాగిస్తున్న గ్రావెల్‌ దందా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మట్టి దందాను కట్టడి చేయాల్సిన అధికారుల్లో కొందరు మామూళ్లకు లొంగి, మరికొందరు బెదిరింపులకు తలొగ్గి మౌనం దాల్చినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలు, పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి పగలు, రాత్రి తేడా లేకుండా టీడీపీ నేతలు గ్రావెల్‌ తవ్వి తరలిస్తుండటంపై పలు గ్రామాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం మార్కాపురం పట్టణ శివారు ప్రాంతమైన శివరాంపురం సమీపంలో ఓ వెంచర్‌కు మట్టి తరలిస్తున్న టిప్పర్‌ 11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలి దగ్ధమైంది. టిప్పర్‌ డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ, ఈ ఘటనపై ఎలాంటి విచారణ చేపట్టిన దాఖలాల్లేవు. టీడీపీ నేతల మట్టి దందా మాత్రం యథావిధిగా సాగుతోంది.

కొండలు మైదానాలుగా..!

మార్కాపురం మండలంలోని చింతకుంట్ల, ఇడూపూరు, పెద్దనాగులవరం కొండ ప్రాంతాలే లక్ష్యంగా టీడీపీ గ్రావెల్‌ మాఫియా దందా సాగిస్తోంది. భారీ యంత్రాలతో కొండ అంచులను క్రమంగా తొలిచేస్తుండటంతో అవి రూపు కోల్పోతున్నాయి. వాలుగా ఉన్న కొండ ప్రాంతాలన్నీ నిరంతర మట్టి తవ్వకాలతో మైదానాలను తలపిస్తున్నాయి. ప్రకృతి సంపదను దోచేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా సంబంధిత శాఖలు నోరు మెదపకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇడుపూరు, నికరంపల్లి, భూపతిపల్లె, పెద్దనాగువరం, చింతకుంట్ల గ్రామాల పరిసరాలు మట్టి మాఫియాకు అడ్డాగా మారాయి. ట్రాక్టర్లు, టిప్పర్లు నిరంతరం రాకపోకలు సాగిస్తున్నా నియంత్రణ చర్యలు మచ్చుకై నా కనిపించడం లేదు. భూపతిపల్లె చెరువులో ఆ గ్రామ టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో ఇటీవల అడ్డగోలుగా మట్టి తవ్వేశారు. రైల్వే ట్రాక్‌ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని మొత్తం 1000 ట్రాక్టర్‌ ట్రిప్పుల మట్టిని తరలించారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1500 చొప్పున దండుకున్నారు. ఇందులో ముఖ్యనేతకూ వాటా చెల్లించినట్లు గ్రామంలో జోరుగా ప్రచారం సాగుతోంది.

నిజాలు బయటపెడితే బెదిరింపులే..

గ్రావెల్‌ మాఫియా దందాను ప్రశ్నించినా, వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన వారిపై టీడీపీ నేతలు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారు. సామాన్యులైతే నేరుగా బెదిరించడం.. అధికారులు అడ్డు తగిలితే బదిలీల పేరుతో వేధించడం పరిపాటిగా మారింది. నిప్పుతో తలగోక్కోవడం ఎందుకుని భావించిన కొందరు అధికారులు.. మట్టి మాఫియా ఆగడాలపై ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది. జిల్లా ఉన్నతాఽధికారులు స్పందించి మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement