కంభంలో నేలకొరిగిన మామిడి చెట్టు
కంభం మండలం పోరుమామిళ్లపల్లి ఇలాకాలో నేలకొరిగిన అరటి తోటలు
కంభం: మంగళవారం సాయంత్రం వీచిన పెనుగాలులు, భారీ వర్షానికి కంభం చెరువు ఆయకట్టు కింద సాగులో ఉన్న సుమారు 50 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని పోరుమామిళ్లపల్లి గ్రామ ఇలాకాలో సాగు చేస్తున్న అరటి చెట్లు ప్రస్తుతం పూత, కాపు దశలో ఉన్నాయి. పెనుగాలుల వీచడంతో కొందరి రైతుల తోటలు పూర్తి స్థాయిలో నేలకొరిగి పోగా మరి కొందరు రైతులకు చెందిన తోటల్లో సగానికి పైగా చెట్లు నేలకొరిగిపోయాయి, చెరువుకట్ట సమీపంలో సాగులో ఉన్న పలు తోటల్లో సైతం అరటి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశామని, మరో మూడు నాలుగు నెలల్లో కోతకు వస్తే పెట్టుబడులు పోనూ లాభాలు వస్తాయన్న గంపెడాశతో ఉన్న రైతులు ఒక్కసారిగా వీచిన పెనుగాలులకు చెట్లన్నీ ఇలా నేలకొరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. గతంలో మోంథా తుఫాన్ దాటికి పలు తోటలు దెబ్బతినగా మిగిలిన తోటలను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు ఇలా మరో నష్టం వాటిల్లింది. మోంథా తుఫాను పరిహారమే నేటికి అందలేదని రైతులు వాపోతున్నారు.
నేలరాలిన మామిడి
పెనుగాలులకు చెట్లకు ఉన్న మామిడి కాయ లు సగానికి పైగా రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పోరుమామిళ్ల ఇలాకాలోని పంటపొలాల్లో ఓ పెద్ద మామిడి చెట్టు నేలకొరిగిపోయింది. ఇంకా పలు చోట్ల మామిడి, ఇతర చెట్లు నేలకొరిగాయి.
గిద్దలూరు రూరల్: బలమైన ఈదురుగాలుల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు అపారనష్టం మిగిల్చింది. గడికోట గ్రామ పంచాయతీ దేవనగరం గ్రామంలో నెమిలయ్యకు చెందిన కోళ్లఫాం ఈదురు గాలుల కారణంగా పూర్తిగా నేలమట్టమైంది. దీంతో నెమిలయ్యకు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కోళ్లఫామ్‌లోని ఫ్యాన్లు, వెంటిలేషన్ మిషన్లు, ఇతర సామాన్లు, కొట్టం షెడ్డు మొత్తం ధ్వంసమయ్యాయి. ఆర్థికంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తున్నాడు. బురుజుపల్లె గ్రామంలో తంగెళ్ల నారాయణరాజుకు చెందిన నాలుగు ఎకరాల అరటి తోట పూర్తిగా ధ్వంసమైంది. రూ.లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.
పెనుగాలులకు కంభంలో నేలకొరిగిన అరటి తోటలు
సుమారు 50 ఎకరాల్లో పంటనష్టం


