రాష్ట్రంలో గాడి తప్పిన కూటమి పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో గాడి తప్పిన కూటమి పాలన

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

ప్రజల పాలనను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

కొండపి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన గాడితప్పిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసి మీ చావు మీరు చావండి అన్నట్లు ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్‌ చోరీ చేస్తూ అన్ని పరిశ్రమలు తానే తీసుకొచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్నాడని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ ఎక్కడుండి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదని, ప్రజల కష్టాలను గాలికొదిలేశారని విమర్శించారు. వారం రోజులుగా రాష్ట్రంలో గ్యాస్‌, డీజిల్‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి రాష్ట్ర ప్రజల మీద ఉన్న శ్రద్ధ ఏపాటిదో తెలుస్తోందన్నారు. పెట్రోలు, డీజిల్‌ కొరతతో నిత్యవసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో డీజిల్‌, పెట్రోల్‌ కొరత పూర్తిగా చంద్రబాబు పాలన వైఫల్యం అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని పెట్రోల్‌, డీజిల్‌ కొరత కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఎందుకు ఉందని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రేషన్‌ విధానంలో ద్విచక్ర వాహనాలకు రెండు లీటర్లు, కార్లకు 15 లీటర్లు, పెద్ద వాహనాలకు 50 లీటర్లు విధానంలో పంపిణీ చేస్తున్నారని ఇతర ప్రైవేట్‌ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూరగాయల ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయని, హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు అమాంతం పెంచేశారన్నారు. సామాన్య ప్రజలకు నిత్యవసర వస్తువులు కొనే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం వారం రోజులుగా చోద్యం చూస్తూ ప్రజలను పట్టించుకోకుండా ఉందని విమర్శించారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ బీపీసీఎల్‌ పెట్రోల్‌ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఆయిల్‌ ట్యాంకర్లు వచ్చేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటిన తర్వాత పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాన్ని పెట్టి మేము ఏదో చేసేశామన్న రీతిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. రెండు రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ అందుబాటులోకి తీసుకు రాకపోతే అన్ని పెట్రోల్‌ బంకుల వద్ద ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం క్రెడిట్‌ చోరీని వదిలేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారిస్తే మంచిదని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement