● యాజమాన్య కుయుక్తులను తిప్పి కొట్టాలి ● ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీరావలి
మార్కాపురం టౌన్: ఆర్టీసీలో విద్యుత్ బస్సుల నిర్వహణకు పినాకెల్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీరావలి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీనే నిర్వహించాలని, ఈ కారణంగా మూత పడుతున్న డిపోల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర డిపోలకు బదిలీ చేయటాన్ని వెంటనే ఆపాలని కోరారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలకు అందిస్తున్న సేవలు ఈ విధానాల వలన దూరమవుతాయన్నారు. పొదిలి డిపో కార్యదర్శి వేణు మాట్లాడుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి 2031 కల్లా బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలన్న కుయుక్తులను తిప్పికొట్టాలని కోరారు. జిల్లా సహాయ కార్యదర్శులు జీ విజయలక్ష్మి, చిరంజీవి, మస్తాన్, సాయి కుమార్ పాల్గొన్నారు.


