వణికించిన గాలివాన | - | Sakshi
Sakshi News home page

వణికించిన గాలివాన

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

కడపరాజుపల్లెలో నేల కూలిన భారీ వేపచెట్టు

బొమ్మలాపురంలో నేల కూలిన అరటి చెట్లు

బొమ్మలాపురంలో గాలి తీవ్రతకు నేల కూలిన బొప్పాయి చెట్లు

మార్కాపురం: మంగళవారం సాయంత్రం వరకు భానుడి ఉగ్రరూపం దాల్చగా..సాయంత్రం తరువాత ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షం, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, పెద్ద దోర్నాల తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచిన గాలులకు పట్టణంలోని ఏకలవ్య కాలనీలో చర్చి వద్ద విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో మార్కాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. గాలీవాన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఎకలవ్య కాలనీలోనే పెద్ద వేప చెట్టు విరిగిపడింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షంనీరు రోడ్లపైకి చేరింది. విజయా టాకీస్‌ ఏరియా, 10వ వార్డు, మీనా మసీద్‌ తదితర ప్రాంతాల్లో సాగర్‌ పైపు లైన్ల కోసం ఏర్పాటు చేసిన గుంతలలోకి నీరు చేరి రోడ్డుపైన పారాయి.

పెద్దదోర్నాల: మండలంలో అకాల వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం సాయంత్రం సుమారు గంటన్నర పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీ గాలీవాన తీవ్రతకు మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లతో పాటు, పలు దుకాణాల పైకప్పు రేకులు నేలకూలాయి. గాలీవాన తీవ్రతకు మండల కేంద్రంలోని శ్రీశైలం రహదారిలో ఉన్న ఒంటేరు రమణయ్య ఇంటి వద్ద ఉన్న వెలగచెట్టు నేలకూలింది. దీంతో పాటు శ్రీశైలం రహదారిలోని పలు దుకాణాల పైకప్పు రేకులు నేలకూలాయి. మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురంలో మంగళవారం వీచిన భారీ గాలుల తీవ్రతకు పలువురు రైతులకు చెందిన అరటి, బొప్పాయి చెట్లు నేలకూలడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు వంద ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు సమాచారం. మండల పరిధిలోని కడపరాజుపల్లెలో గాలీవాన బీభత్సానికి రామాలయం వద్ద నున్న భారీ వేప చెట్టు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభం పడిపోయింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బొమ్మలాపురంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది. అయితే కొన్ని రోజులుగా ఎండల తీవ్రతకు అల్లాడిన ప్రజలు మంగళవారం భారీగా కురిసిన వర్షంతో కాస్త సేద తీరారు.

మండు వేసవిలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు

గంటన్నర పాటు ఈదురుగాలుల బీభత్సం

నేలకొరిగిన అరటి, బొప్పాయి చెట్లు

వంద ఎకరాల్లో పంట నష్టం

కూలిన విద్యుత్‌ స్తంభాలు, భారీ చెట్లు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

Advertisement
 
Advertisement
Advertisement