బేస్తవారిపేట: మోటార్ సైకిల్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన చిన్న కంభం రోడ్డులో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కంభం మండలం యర్రబాలెంకు చెందిన పూసలపాటి బాలఅంకయ్య(40) మోటార్‌సైకిల్‌పై బేస్తవారిపేటకు వెళుతూ చిన్నకంభం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలఅంకయ్యను 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. బాలఅంకయ్య బతుకుదెరువు నిమిత్తం గుంటూరులో ఉంటున్నాడు. బంధువుల వివాహం ఉండటంతో రెండు రోజుల క్రితం బేస్తవారిపేట వచ్చాడు. యర్రబాలెంలో ఉన్న తల్లి రంగమ్మ వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మర్రిపూడి: ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని అయ్యవారిపాలెం– జువ్విగుంట సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తంగెళ్ల పంచాయతీ అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన కర్నాటి కొండపనాయుడు(40) తన భార్యను ఒంగోలు పంపించేందుకు టంగుటూరు– పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారి వద్ద వదిలి ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు క్షతగాత్రున్ని 108 వాహనంలో వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. మృతునికి కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బల్లికురవ: మండలంలోని ముక్తేశ్వరం గ్రామానికి చెందిన కొనిదెన రజనీ (35) 12 రోజులుగా కనిపించడం లేదు. దీంతో ఆమె సోదరుడు రామకోటేశ్వరరావు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం మండలంలోని రామాంజనేయపురం గ్రామ సమీపంలోని అట్టపెట్టెల ఫ్యాక్టరీ వెనుక మహిళ మృతదేహన్ని గుర్తించి పశువుల కాపరులు వీఆర్‌ఓ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్సై వై నాగరాజు పరిశీలించి ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహం రజినీదిగా గుర్తించారు. ఈ మేరకు అదృశ్యం కేసును అనుమానాస్పద మృతిగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సంతమాగులూరు సీఐ శేషగిరిరావు పరిశీలించారు.
● రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి
ఒంగోలు టౌన్: కుమారుడి పుట్టెంట్రుకలు తీయించడానికి వెళుతూ తిరిగిరాని లోకాలకు చేరాడో తండ్రి. జీఆర్‌పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం...కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన సంజు కుమార్ హైదరాబాద్‌లోని టీ స్టాల్‌లో మాస్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడి పుట్టెంట్రుకలు తీయించడానికి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి బయలుదేరాడు. ఎండలు తీవ్రంగా ఉండడంతో మంచినీళ్ల కోసం ఒంగోలులోని మూడో నంబర్ ప్లాట్‌ఫారంలో రైలు దిగాడు. నీళ్ల బాటిల్ కొనుక్కొని తిరిగి రైలు ఎక్కే సమయానికి పొరపాటున జారి పడిపోయాడు. రైలు పట్టాల మధ్య పడడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో భార్య పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


